వాటర్ బాటిల్స్ ను తాకిన వార్ హీట్. మంచినీళ్లూ కొనలేమా?

Date:


Business

-Lingareddy Gajjala

ఈ సారి వేసవి హీట్ గట్టిగానే ఉంటుందనే వార్తలతో భారీగా సేల్స్ పెంచుకోవచ్చని భావించిన వాటర్ బాటిల్స్ పరిశ్రమకు వార్ షాక్ ఈడ్చి కొట్టింది. భారతదేశంలో సుమారు రూ. 40,000 కోట్ల విలువైన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ ఇప్పుడు ఊహించని సంక్షోభంలో పడింది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండిపోతుండటంతో, బాటిళ్ల తయారీకి వాడే ప్లాస్టిక్ (పాలిమర్) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వేసవిలో నీటి డిమాండ్ గరిష్ట స్థాయికి చేరే సమయానికి ముందే ఈ ధరల బాదుడు మొదలవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వాటర్ బాటిళ్ల తయారీలో కీలకమైన పాలిమర్ ధర ఏకంగా 50 శాతం పెరిగి కిలోకు రూ. 170కి చేరింది. కేవలం బాటిల్ బాడీ మాత్రమే కాదు, పైన ఉండే మూత ధర కూడా ఒక్కో ముక్కకు రూ. 0.45కి పెరిగి రెట్టింపు అయ్యింది. దీనికి తోడు ప్యాకింగ్ చేసే కార్టన్ బాక్సులు, లేబుళ్లు, టేపుల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో తయారీదారులు విలవిల్లాడుతున్నారు.

మనపైనే Water Bottle భారం….

ప్రస్తుతానికి బిస్లరీ, కిన్లీ వంటి దిగ్గజ కంపెనీలు రిటైల్ ధరలను మార్చకపోయినా, దాదాపు 2,000 మంది చిన్న తయారీదారులు తమ రీసెల్లర్లకు ఒక్కో బాటిల్‌పై రూ. 1 చొప్పున (సుమారు 5%) ధర పెంచేశారు. “ప్రస్తుతం మార్కెట్‌లో గందరగోళం ఉంది.. మరో నాలుగు ఐదు రోజుల్లో ఈ పెరిగిన ధరల ప్రభావం నేరుగా కస్టమర్లపై పడుతుంది” అని అఖిల భారత ప్యాకేజ్డ్ వాటర్ అసోసియేషన్ ఫెడరేషన్ సెక్రటరీ అపూర్వ దోషి హెచ్చరించారు. అంటే, త్వరలోనే మీరు తాగే రూ. 20 వాటర్ బాటిల్ ధర పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రీమియం Water Bottle కూడా భారమే!

కేవలం సామాన్యులు వాడే బాటిళ్లే కాదు, ధనవంతులు ఇష్టపడే మినరల్ వాటర్ ధరలు కూడా మండుతున్నాయి. ప్రీమియం వాటర్ కంపెనీ అయిన ‘ఆవా’ (Aava) ఇప్పటికే రీసెల్లర్లకు ధరలను 18 శాతం పెంచేసింది. తయారీదారులు పెరిగిన ఖర్చులో సగం తామే భరిస్తున్నప్పటికీ, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ భారాన్ని కస్టమర్ల మీద వేయక తప్పదని కంపెనీ సీఈఓ షిరోయ్ మెహతా స్పష్టం చేశారు.

ఎందుకీ పరిస్థితి?

దేశంలోని భూగర్భ జలాల్లో 70 శాతం కలుషితమై ఉండటంతో, సురక్షితమైన నీటి కోసం లక్షలాది మంది ప్రజలు ప్యాకేజ్డ్ వాటర్‌పైనే ఆధారపడుతున్నారు. ముడి చమురు పెరిగితే ప్లాస్టిక్ తయారీ వ్యయం పెరుగుతుంది.. ప్లాస్టిక్ ఖరీదైతే బాటిల్ ధర పెరుగుతుంది. ఈ చమురు సెగ ఇలాగే కొనసాగితే, మండుతున్న ఎండల్లో చల్లని నీరు కొనాలన్నా జేబులు ఖాళీ అవ్వక తప్పదు!



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related