Andhra Pradesh
oi-Sai Chaitanya
విద్యార్ధులకు పరీక్షలు పూర్తవుతున్నాయి. దీంతో.. విద్యార్ధులకు తదుపరి తరగతుల నిర్వహణ .. వేసవి సెలవుల పై అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యారు. ఫలితాల తేదీల పైన స్పష్టత వస్తోంది. ఇక.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసారు. దీని ద్వారా పరీక్షలు.. పండుగ ల సెలవులు… తరగతుల నిర్వహణ పైన పూర్తి వివరాలను వెల్లడించారు. దీంతో.. ముందస్తుగానే విద్యార్ధులు- పేరెంట్స్ ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసుకునే వెసులుబాటు కలగనుంది.
ఏపీలో ఇంటర్మీడియట్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కేలండర్ విడుదలైంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ బాషా బుధవారం విడుదల చేసిన అకడమిక్ కేలండర్లో పొందుపరిచారు. ఏప్రిల్ 24 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. మరలా జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులు పున:ప్రారంభమవుతాయని వెల్లడించారు. అక్టోబరు 10 నుంచి 20వ తేదీ వరకు దసరా, 2027 జనవరి 9 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరిలో, పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి, మార్చిలో ఉంటాయని తెలిపారు. మొత్తం 232 పనిదినాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. కాగా.. ఏప్రిల్ 10వ తేదీ లోగా ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
2026-27 అకడమిక్ క్యాలెండర్.. ఇంటర్ బోర్డు తాజా ఆదేశాలు
ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏప్రిల్ రెండో వారంలో ఫలితా లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. మూల్యాంకనం పారదర్శకంగా, తప్పులు లేకుండా చేసేందుకు సూచనలు, పెనాల్టీలు జారీ చేశామన్నారు. కాగా.. అడ్మిషన్ల కోసం హోర్డింగులు, కరపత్రాలు, గోడలపై రాతలు, మీడియా ద్వారా ప్రచారం లాంటివి చేయకూడదని ఇంటర్ విద్యామండలి ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. మీ పిల్లలను కచ్చితంగా ఉత్తీర్ణుల్ని చేస్తామనే హామీలు ఇవ్వకూడదని ఆదేశించింది. ఇలాంటివి నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీని ద్వారా ఇంటర్ ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయటం ద్వారా విద్యార్ధులకు ప్రయోజన కరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.


