India
oi-Sai Chaitanya
వంట గ్యాస్ కొరత ప్రధాన ఆలయాల పైనా ప్రభావం చూపుతోంది. తిరుమలలో నిత్యం పెద్ద సంఖ్య లో భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తూ ఉంటారు. సమస్య ప్రారంభమైన సమయంలో నే ఆయిల్ కంపెనీలతో చర్చల ఫలితంగా తిరుమలలో ఎలాంటి సమస్య తలెత్త లేదు. మరో ప్రముఖ ఆలయం షిర్డీ సాయి బాబా ఆలయం లో ప్రసాదాల తయారీ పైన గ్యాస్ కొరత ప్రభావం వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయాల పైన అధికారులు ఫోకస్ చేస్తున్నారు.
షిర్డీ సాయిబాబా ఆలయంలో నిత్యం దాదాపు 40 వేల మంది భక్తులకు ప్రసాదం అందిస్తూ ఉంటారు. ఇందు కోసం దాదాపుగా అర టన్ను వరకు ఎల్పీజీ గ్యాస్ అవసరం అవుతుంది. గ్యాస్ కొరత వార్తలు ఆలయ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం షిర్డీ సాయిబాబా సంస్థాన్‌లో మరో 11 రోజులపాటు ప్రసాదం తయారుచేయడానికి సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే మాత్రం శిర్డీ ఆలయంలో ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు ప్రసాదం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈనెల చివర్లో శ్రీరామనవమి పండగ జరగనుంది. అప్పుడు గుడిలో లడ్డూలు, బూందీల తయారీని ఆపేయాల్సి వస్తుందని శిర్డీ సాయిబాబా సంస్థాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి షిర్డీకి నిత్యం దాదాపు 70 వేల మంది వరకు భక్తలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. భక్తులందరికీ సాయిబాబా సంస్థాన్ ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రసాదాలయం (సామూహిక భోజనశాల)లో పోలి (రొట్టె), వెజిటబుల్ కర్రీ (కూర), పప్పు-అన్నం, ఒక స్వీట్‌ను వడ్డిస్తుంది.
ప్రత్యామ్నాయ మార్గాలతో పరిష్కారం
కాగా, ప్రస్తుతం గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయ పద్దతుల పైన ఆలయ అధికారులు ఫోకస్ చేసారు. ఆలయంలో ‘సోలార్ కుకింగ్ సిస్టమ్‌ను’ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రసాదాలయం ఆవరణలో 73 సౌర ఫలకాలను అమర్చారు. ఈ ఫలకాలు సూర్యకిరణాల నుంచి ఉష్ణాన్ని గ్రహించి ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వినియోగిస్తారు. ఈ విధానం ద్వారా ప్రతిరోజూ సుమారు 2,800 కిలోల ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఈ ఆవిరిని ఉపయోగించి భారీ సామర్థ్యం కలిగిన ప్రెషర్ కుక్కర్లలో ప్రసాదాలయంలో ఆహారాన్ని వండుతున్నారు. శిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రసాదాలయంలో 150 లీటర్ల సామర్థ్యం కలిగిన పది భారీ వంట పాత్రలను ఏర్పాటు చేసింది. ఈ పాత్రల సహాయంతో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ మొత్తంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. అధికారులు అందుబాటులోకి తెచ్చిన సోలార్ కుకింగ్ విధానంతో ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రయోజనకరంగా మారింది. అయితే, కొన్ని పదార్ధాల తయారీకి మాత్రం వంట గ్యాస్ వినియోగిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా వీటి తయారీ పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.


