Business
oi-Chandrasekhar Rao
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హాస్పిటాలిటీ బ్రాండ్ హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. భారత్ కు గుడ్ బై చెప్పింది. దేశీయ మార్కెట్ నుంచి తప్పుకోనుంది. దేశంలో వివిధ నగరాల్లో ఉన్న అన్ని అవుట్‌లెట్‌లను మూసివేయనుంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన వెలువడింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది.
దేశంలో హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను నిర్వహించే భాగస్వామ్య సంస్థ జేఎస్ఎం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఉన్న లైసెన్సింగ్ ఒప్పందం ఆకస్మికంగా రద్దు కావడం వల్లే హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామం హార్డ్ రాక్ అభిమానులు, కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
దేశంలో హార్డ్ రాక్ కు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో రంగంలో రాణిస్తోందా సంస్థ. టాప్ బ్రాండ్ గా ప్రజల నుండి అపూర్వమైన ఆదరణను అందుకుంది. ఉల్లాసమైన వాతావరణం, లైవ్ మ్యూజిక్, ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి చెందాయి ఈ హార్డ్ రాక్ అవుట్ లెట్లు.
దేశంలో అడుగు పెట్టిన కొద్దికాలంలోనే 10 నగరాలకు విస్తరించింది. బెంగళూరులో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, వైట్‌ఫీల్డ్ లో దీనికి అవుట్ లెట్లు ఉన్నాయి. ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, హైదరాబాద్ హైటెక్ సిటీ, కోల్‌కతా, పుణెల్లో ఐటీ హబ్ వంటి ప్రాంతాల్లో వీటికి మంచి ఆదరణ ఉంటోంది. మూసివేత నిర్ణయం ఉద్యోగులు, కస్టమర్లలో ఆందోళన రేకెత్తించింది.
లైసెన్స్ ఒప్పందం రద్దుకు అధిక అద్దె బకాయిలు, తగ్గుతున్న లాభదాయకత, అలాగే హార్డ్ రాక్ ఇంటర్నేషనల్, జేఎస్ఎం కార్పొరేషన్ ప్రైవేట్ మధ్య వ్యూహాత్మక, కార్యాచరణపరమైన తేడాలు కారణమని భావిస్తోన్నారు. ఈ అవుట్‌లెట్‌ల మూసివేత వల్ల ఆయా ప్రదేశాలలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు.
In some very sad news, Hard Rock Cafe Bengaluru, Bengaluru Int. Airport, Bengaluru Whitefield, Chandigarh, Chennai, Hyderabad, Hyderabad Hitech City, Kolkata, New Delhi, Pune will be closing.
Hard Rock International has formally terminated its agreements with JSM Corporation Pvt… pic.twitter.com/lvHomIiIrc
— Chandra R. Srikanth (@chandrarsrikant) March 16, 2026
భారత్ లో తన వ్యాపార కార్యకలాలపాలను కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను హార్డ్ రాక్ యాజామన్యం అన్వేషించే అవకాశాలు లేకపోలేదు. వ్యాపార భాగస్వామ్యాలు లేదా ప్రత్యక్షంగా కార్యకలాపాల నసాగించడానికి మార్గాలను అన్వేషిస్తున్నట్లు హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ తెలిపింది. గోవాలోని కలంగుటేలో ఉన్న హార్డ్ రాక్ హోటల్ మాత్రం యధాతథంగా పని చేస్తుంది. ఈ హోటల్ కు జేఎస్ఎంతో సంబంధం లేకపోవడమే దీనికి కారణం.


