హార్మూజ్ జలసంధి మూసే ఉంటుంది.. అమెరికాను వదలం

Date:


International

-Bomma Shivakumar

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం 13 రోజుకు చేరింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై తాజాగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. దాంతో చమురు సంక్షోభం మరింతగా ముదిరింది. అయితే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు అయతొల్లా మొజ్తాబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి మూసే ఉండాలని అన్నారు. శత్రు దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యలు తప్పవని పేర్కొన్నారు.

అంతేకాక తన తొలి ప్రసంగంలో అమెరికాపై మొజ్తాబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలను తక్షణమే మూసేయాలని, లేదంటే దాడులు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టంచేశారు. శత్రువుల నుంచి నష్టపరిహారం తీసుకుంటామని, లేదంటే వాళ్ల ఆస్తులు ధ్వంసం చేస్తామని ఖమేనీ తెలిపారు. ఇరాన్ పై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇక అయతొల్లా అలీ హతం తర్వాత మార్చి 9న ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌ గా మొజ్తాబా ఖమేనీ నియమితులైన విషయం తెలిసిందే.

ఇక మొజ్తాబా ఖమేనీ ప్రకటన అనంతరం ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో ధరలు గణనీయంగా పెరిగాయి. తాజాగా బ్యారెల్‌ కు 200 డాలర్లకు చేరవచ్చని ఇరాన్ హెచ్చరించింది.

ఖమేనీ ఎంపికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “అతను శాంతి యుతంగా నిర్ణయాలు తీసుకుంటాడని నేను అనుకోవడం లేదు” అని స్పష్టం చేశారు. మరోవైపు వైమానిక దాడులతో ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడం సాధ్యపడదని.. చర్చలతోనే అది సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఇరాన్ లోని కీలక, సైనిక మౌలిక సదుపాయాలపై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇంకా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ తో పాటు ఇరాన్ కూడా తన ప్రతీకార దాడులను పెంచింది. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో చమురు ట్యాంకర్లపై దాడి చేస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related