International
oi-Dr Veena Srinivas
మనుషుల్లోనే కాదు జంతువులలో కూడా భావోద్వేగాలు ఉంటాయి. ఇక మనుషుల తరహాలోనే భావోద్వేగాలు ఉండే జీవులలో కోతులు ఒకటి. ఇటీవల ఓ చిన్న కోతి పిల్ల తన తల్లి కోసం పరితపించిన ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోట్లాదిమంది హృదయాలను కదిలించిన పంచ్ అనే పేరు ఉన్న కోతి పిల్ల కథ విషయానికి వస్తే…
తల్లి చనిపోయి ఒంటరైన కోతిపిల్ల
జపాన్‌లోని ఒక జూలో జన్మించిన ఈ కోతి పిల్లకు “పంచ్” అనే పేరు పెట్టారు. జన్మించిన కొద్దికాలానికే తల్లి దూరమవడంతో పంచ్ తీవ్ర ఒంటరితనంలోకి వెళ్లింది. తల్లి ప్రేమ కోసం తపించిన ఆ కోతి పిల్ల పరిస్థితి చూసి జూ సిబ్బంది కూడా భావోద్వేగానికి లోనయ్యారు. దానిని వారు చాలా ప్రేమగా చూసుకున్నారు. అయితే అది తమ జాతి కోతులతో కలవాలని అప్పుడే దాని ఒంటరితనం పోతుందని భావించారు.
బొమ్మ పట్టుకుని నిద్రిస్తున్న కోతిపిల్ల
దానిని ఇతర కోతులతో కలపడానికి ప్రయత్నం చేశారు. పంచ్‌ను మనుషుల సంరక్షణలో పెంచినా, ఇతర కోతులతో కలవడం దానికి సులభం కాలేదు. ఒంటరిగా ఒక మూలన కూర్చోవడం, ఎవరితోనూ కలవకుండా ఉండటం చూసిన అందరినీ కలచివేసింది. అప్పుడు జూ సిబ్బంది ఒక బొమ్మను పంచ్‌కు ఇచ్చారు. ఆ బొమ్మను పంచ్ తన తల్లిలా భావించి గట్టిగా కౌగిలించుకుని నిద్రపోవడం ప్రారంభించింది.
వీడియో చూసిన ప్రతీ ఒక్కరిలో భావోద్వేగం
ఎక్కడికి వెళ్లినా దానిని పట్టుకుని వెళ్లడం, భయపడ్డప్పుడు లేదా ఒంటరితనం అనిపించినప్పుడు ఆ బొమ్మను గుండెలకు హత్తుకుని ఉండేది. పడుకుని నిద్రించినా కూడా ఆ బొమ్మనే అమ్మలా భావించి దానిని హత్తుకునే పడుకునేది. ఈ హృదయాన్ని తాకే దృశ్యాలు వీడియో రూపంలో బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.అనేక మంది ఈ చిన్న కోతి పిల్ల ప్రేమ కోసం పడిన తపన చూసి భావోద్వేగానికి గురయ్యారు.
భావోద్వేగాలు జంతువులకూ ఉంటాయి
ఆ తర్వాత పంచ్ మెల్లగా ఇతర కోతులతో కలిసిపోవడం ప్రారంభించింది. కొత్త సమూహంలో తన స్థానం ఏర్పరుచుకుంటూ, మళ్లీ సహజ జీవితానికి అలవాటు పడుతోంది. తల్లి ప్రేమ కోల్పోయినా, ఒక బొమ్మలో ఆ ప్రేమను వెతుక్కుంటూ జీవితం ముందుకు సాగించిన పంచ్ కథ ప్రతి ఒక్కరి మనసులను కదిలిస్తోంది. ప్రేమ ఆప్యాయత అనేవి ప్రతి జీవికి అవసరమని, అది మనిషైనా, జంతువులైనా భావోద్వేగాలు ఒకటేనని అందరికీ అర్థమయ్యేలా చెబుతోంది.


