Telangana
oi-Jakki Mahesh
తెలంగాణ అభివృద్ధిలో ప్రతి పౌరుడిని భాగస్వామిని చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజా కేంద్రీకృత పాలనే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేస్తూ.. విజన్-2047 ద్వారా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పటిష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరుకోవడం గమనార్హమని.. ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతోందని ఆయన కొనియాడారు.
నగరాల అభివృద్ధికి సరికొత్త నమూనాలు
రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని.. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి కోసం ‘క్యూర్, ప్యూర్, రేర్’ అనే వినూత్న మోడల్స్‌ను ప్రభుత్వం అనుసరిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని నాలుగు కమిషనరేట్లుగా విభజించడం ద్వారా పాలనను మరింత చేరువ చేశామని గవర్నర్ వెల్లడించారు. అలాగే, ‘హైడ్రా’ ద్వారా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి.. సుమారు రూ. 60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
ఐటీ, పారిశ్రామిక ప్రగతి
హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని.. ఈ రంగం దాదాపు 9.39 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. జీసీసీలలో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉండటం నగరాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా నిలిపిందని పేర్కొన్నారు. బయో ఆసియా సదస్సు ద్వారా రూ. 1700 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని.. రాబోయే రోజుల్లో కొడంగల్ ప్రాంతం భారీ పారిశ్రామికవాడగా అవతరించబోతోందని ఆయన వివరించారు.
రైతు సంక్షేమం, సాగునీరు
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. గతేడాది రైతు భరోసా కింద రూ. 8,744 కోట్లు పంపిణీ చేశామని గవర్నర్ తెలిపారు. పంట రుణమాఫీ కోసం ఏకంగా రూ. 20,616 కోట్లు ఖర్చు చేశామని.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సామాన్యుల సంక్షేమం కోసం కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామని, 3.38 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని వెల్లడించారు.
మహిళా సాధికారత, ఉపాధి:
మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ. 9,222 కోట్లు ఆదా అయ్యాయని గవర్నర్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష కోట్ల రుణాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇక నిరుద్యోగుల విషయంలో టీజీపీఎస్సీ వంటి నియామక బోర్డులను సంస్కరించి, రికార్డు స్థాయిలో 67,763 ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. అలాగే, ‘ఈగల్’ ప్రత్యేక బృందం ద్వారా డ్రగ్స్ సమస్యను వేళ్లతో సహా నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు.


