India
oi-Bomma Shivakumar
వెస్ట్ బెంగాల్ లో ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారుతోంది. బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. అయితే తాజాగా టీఎంసీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను టీఎంసీ పార్టీ 291 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన మూడు సీట్లను డార్జీలింగ్ హిల్స్ కు సంబంధించి అనిత్ తపా నేతృత్వంలోని బీజీపీఎం పార్టీకి కేటాయించింది. ఈ మేరకు అభ్యర్థుల వివరాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
ఈ మేరకు బీజేపీపై మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. బీజేపీని బాయికాట్ చేసి తృణమూల్ కు బెంగాల్ ప్రజలు ఓటు వేయాలని కోరారు. గౌరవనీయులైన ప్రధాని మోదీ.. మీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే.. బెంగాల్ పై ప్రతిసారి ఎటాకింగ్ ఎందుకు చేస్తున్నారు..? గుర్తుంచుకోండి.. బెంగాల్ కూడా ప్రతీకారం తీర్చుకోగలదు. అలాగే మమతా బెనర్జీ ఎస్ఐఆర్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జ్యూడిషియరీపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. బీజేపీని బాయికాట్ చేసి తృణమూల్ కు ఓటేయాలని మమతా బెనర్జీ కోరారు.
బెంగాల్ అస్థిత్వం కోసం జరిగే పోరు ఇది అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వాళ్లు తమ నుంచి అన్నీ లాగేసుకున్నారని మండిపడ్డారు. కానీ ప్రజల శక్తిని మాత్రం లాగేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. తాను అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధం అవుతుంటే బీజేపీ ఎందుకు భయపడుతుందని అన్నారు. ఏజెన్సీలు లేకుండా, గ్యాస్ సంక్షోభం లేకుండా, శాంతితో ఫైట్ చేయండి.. వాళ్లు చాలా తెలివైన గేమ్ ఆడుతున్నారు.. అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 2026 ఎన్నికల్లో దాదాపు 226 కంటే అధిక స్థానాల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ మేరకు 291 మంది అభ్యర్థుల జాబితాను మమతా బెనర్జీ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు టీఎంసీ జనరల్ సెక్రటరీ, లోక్ సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆమె అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక మమతా బెనర్జీ టీఎంసీకు కంచుకోట అయిన భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నారు. లిస్టులో 52 మంది మహిళలు ఉన్నారు. అలాగే 95 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఇక ఏప్రిల్ 23, 29 రెండు విడతల్లో బెంగాల్ లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కౌంటింగ్ మే 4 న జరగనుంది.


