International
oi-Lingareddy Gajjala
వసంతం రాకముందే ఇరాన్ గడ్డపై మృత్యువు తాండవిస్తోంది. ప్రకృతి పులకించే ‘వసంత విషువత్తు’ (Spring Equinox) వేళ, సరిగ్గా కొత్త ఏడాదికి స్వాగతం పలికే ‘నౌరూజ్’ పండుగ సమయంలో ఇరాన్ ఆకాశం క్షిపణుల కాంతితో నిండిపోయింది. పర్షియన్ భాషలో ‘నౌరూజ్’ అంటే ‘కొత్త రోజు’ అని అర్థం. కానీ నేడు ఇరాన్ ప్రజలకు ఆ కొత్త రోజు ఆశాజనకంగా లేదు, సరికదా.. అంతులేని భయం, అనిశ్చితి, అభద్రతతో కూడిన చీకటి రోజుగా మిగిలిపోతోంది. మూడు వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ మహోత్సవం, ఈసారి అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ధాటికి తన ప్రాభవాన్ని కోల్పోయి, శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తోంది.
సాధారణంగా నౌరూజ్ అంటే ఇళ్లన్నీ శుభ్రం చేసుకుని (ఖోనెహ్ టకాన్), కొత్త బట్టలు ధరించి, పసందైన పిండివంటలతో బంధుమిత్రులను పలకరించే అద్భుతమైన సమయం. కానీ నేడు ఆ ఉత్సాహం స్థానంలో భయం వచ్చి చేరింది. ఇళ్లను శుభ్రం చేయాల్సిన చేతులు, కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి తమ వారి మృతదేహాలను వెలికితీస్తున్నాయి.
బంధువుల ఇళ్లకు వెళ్లాల్సిన వారు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వేలాది మంది అమాయకుల మరణాలు, లక్షలాది మంది నిరాశ్రయులైన స్థితిలో.. పండుగ సంబరం అనేది ఒక అందని ద్రాక్షలా మారిపోయింది. బాణాసంచా పేలుళ్ల స్థానంలో క్షిపణుల పేలుళ్లు వినిపిస్తుంటే, ఇది కొత్త ఆరంభంలా కాకుండా ప్రతి ఇరానియన్ సహనానికి పెడుతున్న పరీక్షలా అనిపిస్తోంది.
చరిత్ర పునరావృతం.. 1980ల నాటి భీభత్సం..
ప్రస్తుత పరిస్థితులు ఇరాన్ ప్రజలకు 1980ల నాటి ఇరాక్-ఇరాన్ యుద్ధాన్ని గుర్తు చేస్తున్నాయి. దశాబ్దాల తర్వాత మళ్లీ ఒక భారీ యుద్ధం మధ్యలో నౌరూజ్ జరుపుకోవడం వారిని మానసికంగా కుంగదీస్తోంది. చాలా మందికి నౌరూజ్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది వారి అస్తిత్వానికి, చరిత్రకు, ఆశకు ప్రతీక. అందుకే, మృత్యువు అంచున ఉన్నప్పటికీ, కొందరు ధైర్యవంతులు తమ సంప్రదాయ ‘హఫ్ట్-సిన్’ (Haft-Sin) టేబుల్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
పునరుజ్జీవనానికి చిహ్నంగా నిలిచే ఏడు వస్తువులతో కూడిన ఆ టేబుల్, ఈ కష్టకాలంలో తమకు పోరాడే శక్తినిస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే, మెజారిటీ ప్రజలు మాత్రం తమ దేశ భవిష్యత్తు అంధకారంలో ఉండగా, ఈ వేడుకలు అర్థరహితమని కన్నీరు మునిగవుతున్నారు.
వసంతం కోసం నిరీక్షణ…
వసంత కాలం ప్రకృతిలో కొత్త మార్పును తీసుకొచ్చినట్టే, తమ జీవితాల్లో కూడా యుద్ధం ఆగిపోయి శాంతి వికసించాలని ప్రతి ఇరానియన్ ప్రార్థిస్తున్నాడు. పగ, ప్రతీకారాల మధ్య నలుగుతున్న సామాన్యుల ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోకూడదు. బాంబుల మోత ఆగి, ప్రార్థనల ధ్వని వినిపించాలని, వచ్చే నౌరూజ్ అయినా భయం లేని వాతావరణంలో జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు ఆకాంక్షిస్తున్నారు. ఆనందం స్థానంలో ఆందోళనలు, వెలుగుల స్థానంలో చీకట్లు నిండిన ఈ నౌరూజ్.. ఇరాన్ చరిత్రలో ఒక మరచిపోలేని గాయంగా మిగిలిపోనుంది.


