News
oi-Suravarapu Dileep
Smartphone Price Hike: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీపై అదనపు భారం పడటం ఖాయంలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో స్మార్ట్‌ఫోన్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బడ్జెట్‌లో దొరికిన ఫోన్లు ఇప్పుడు ప్రియమైపోతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో, మనం ఇప్పుడే ఫోన్ కొనాలా లేదా ఆగాలా అనే విషయాలను తెలుసుకుందాం.
అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
దీనికి ప్రధాన కారణం ‘మెమరీ చిప్స్’ (Memory Chips). ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ చిప్స్ చాలా కీలకం. ప్రస్తుతం ప్రపంచమంతా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) మయం అయిపోయింది. శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ వంటి దిగ్గజ చిప్ తయారీ కంపెనీలన్నీ ఏఐ డేటా సెంటర్ల కోసం హై-ఎండ్ చిప్స్ తయారు చేయడంపైనే దృష్టి పెట్టాయి.
దీంతో ఫోన్లలో వాడే సాధారణ మెమరీ చిప్స్ దొరకడం కష్టమైంది. డిమాండ్ పెరగడంతో శాంసంగ్ చిప్స్ రేట్లను ఏకంగా 60% వరకు పెంచేసింది. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో, విదేశాల నుంచి విడిభాగాలను కొనడానికి కంపెనీలకు ఎక్కువ ఖర్చవుతోంది. ఈ భారాన్ని కంపెనీలు భరించలేక, ఆ ఖర్చును కస్టమర్ల మీద వేస్తున్నాయి.
ఇప్పటికే రేట్లు పెరిగాయి..
ఇది ఏదో భవిష్యత్తులో జరిగేది కాదు, ఇప్పటికే మార్కెట్లో ధరల పెరుగుదల మొదలైపోయింది. ఉదాహరణకు, ప్రముఖ బ్రాండ్ iQOO Neo 10 ధర ఏకంగా రూ.3,000 పెరిగి రూ.34,999కి చేరింది. అలాగే OPPO Reno 14 Pro ధర కూడా రూ.3,000 పెరిగి రూ.52,999కి చేరింది.
బడ్జెట్ ఫోన్లైన ఐకూ Z10 వంటి మోడల్స్ పైన కూడా రూ.1,000 వరకు భారం పడింది. వివో (Vivo), రియల్‌మీ (Realme) వంటి ఇతర బ్రాండ్లు కూడా మెల్లగా తమ ఫోన్ల రేట్లను సవరిస్తున్నాయి.
బడ్జెట్ ఫోన్ల పరిస్థితి ఏంటి?
ఇండియాలో 60 శాతం మంది వాడేది బడ్జెట్ ఫోన్లే. ఫోన్ తయారీ ఖర్చులో మెమరీ చిప్స్ వాటా సుమారు 10-15% ఉంటుంది. ఇప్పుడు చిప్స్ రేట్లు పెరగడంతో, రాబోయే రోజుల్లో బడ్జెట్ ఫోన్ల ధరలు కూడా కనీసం 10% పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలనుకునే సామాన్యులకు ఇది పెద్ద దెబ్బే.
మరి, ఇప్పుడే కొనాలా? వద్దా?
నిపుణుల సలహా ప్రకారం.. మీకు నిజంగా కొత్త ఫోన్ అవసరం ఉంటే, వాయిదా వేయకుండా ఇప్పుడే కొనడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో లాంచ్ అయ్యే కొత్త మోడల్స్ ధరలు మనం ఊహించిన దానికంటే రూ.6,000 వరకు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న స్టాక్ అయిపోతే, కొత్త స్టాక్ పెరిగిన ధరలతోనే వస్తుంది.
పాత ఫోన్ బాగుంటే..
ఒకవేళ మీ ప్రస్తుత ఫోన్ బాగానే పనిచేస్తుంటే, అనవసరంగా కొత్తది కొనకండి. ఇప్పుడు వస్తున్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వల్ల పాత ఫోన్లు కూడా కొత్తవాటిలాగే సెక్యూర్డ్ గా పనిచేస్తాయి. మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి, కానీ అప్‌గ్రేడ్ తప్పనిసరి అనుకుంటే మాత్రం ఆలస్యం వద్దు.
Best Mobiles in India
English summary
Why Smartphone Prices Are Rising in India and Why You Should Buy Now
Story first published: Monday, December 8, 2025, 12:05 [IST]


