News
oi-Suravarapu Dileep
సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్ ను ఈ సంవత్సరం ప్రారంభంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా మీరు కొనుగోలు చేసిన ఫోన్‌లు ఒరిజినల్ లేదా నకిలీవా అనేది తెలుసుకోవచ్చు. దీంతోపాటు స్పామ్ కాల్స్‌పై ఫిర్యాదు చేయవచ్చు. మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో గుర్తించి, అవసరం లేని మరియు వినియోగంలో లేని నంబర్లను బ్లాక్ చేయమని విజ్ఞప్తి చేయవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే ఈ సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi App) అన్ని ఫోన్‌లలో ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని, డిలీట్ చేసేందుకు అవకాశం లేకుండా చూడాలని.. తయారీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం రాత్రి PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) కూడా ప్రకటన చేసింది.
వెనక్కి తగ్గిన కేంద్రం :
సంచార్ సాథీ యాప్‌ను డిఫాల్ట్ యాప్‌గా ఉండేలా తీసుకున్న నిర్ణయం అమలు చేసేందుకు.. సంబంధిత సంస్థలకు 90 రోజుల గడువు ఇచ్చింది. దీనిపై నివేదిక ఇచ్చేందుకు 120 రోజుల గడువు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై 24 గంటల వ్యవధిలోనే కేంద్రం వెనక్కి తగ్గింది.
కేంద్ర మంత్రి కీలక ప్రకటన :
కేంద్ర కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ అంశంపై స్పందించారు. సంచార్ సాథీ యాప్ వినియోగించడం ఇష్టం లేకుంటే, డిలీట్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఇతర యాప్‌లు మాదిరిగానే ఈ యాప్‌ను కూడా డిలీట్ చేసుకోవచ్చన్నారు.
ఆ బాధ్యత ప్రభుత్వానిదే :
సైబర్ మోసాల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకొనేందుకు సంచార్ సాథీ యాప్ ఉందని అనేక మందికి అవగాహన లేదని, ఈ సమాచారాన్ని వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ఈ యాప్ వినియోగించడం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.
ఈ సంవత్సరం జనవరిలో కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ఆధారంగా ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేశారు. 3.7 లక్షల ఫోన్‌లను బ్లాక్ చేశారు.
> సంచార్ సాథీ యాప్ ద్వారా స్పామ్ కాల్స్, SMS లను బ్లాక్ చేయవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు.
> ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైన సందర్భాల్లో సంచార్ సాథీ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌సైట్, యాప్ ద్వారా మీ ఫోన్‌ను ఇతరులు వినియోగించకుండా బ్లాక్ చేయమని విజ్ఞప్తి చేయవచ్చు.
> కొత్త లేదా సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన సందర్భాల్లో.. ఈ డివైజ్ ఒరిజినల్ లేదా నకిలీ అని తెలుసుకొనేందుకు సంచార్ సాథీ వెబ్‌సైట్/ యాప్‌లో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది.
> మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకొనేందుకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. వినియోగంలో లేని, మీకు సంబంధం లేని నంబర్లను ఈ ప్లాట్‌ఫాం నుంచే నేరుగా బ్లాక్ చేయమని కోరవచ్చు.
Best Mobiles in India
English summary
sanchar saathi app can be deleted says union minister jyotiraditya scindia
Story first published: Tuesday, December 2, 2025, 17:50 [IST]


