మణిపూర్ కొత్త సీఎంగా ఖేంచంద్ సింగ్.. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన కేంద్రం!

Date:


India

oi-Jakki Mahesh

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గతేడాది కాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. బుధవారం(ఫిబ్రవరి 4) జరిగిన కీలక పరిణామాల మధ్య బీజేపీ సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ యుమ్నామ్ ఖేంచంద్ సింగ్ మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఏడాది తర్వాత ప్రజాస్వామ్యం పునరుద్ధరణ
ఫిబ్రవరి 2025లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది. సరిగ్గా ఏడాది తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మణిపూర్‌లో మళ్లీ ఎన్నికైన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే మార్గం సుగమమైంది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా.. ఖేంచంద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

కుకీ, నాగా, మెయిటీ వర్గాలకు ప్రాతినిధ్యం
మణిపూర్‌లో ఉన్న జాతిపరమైన విభేదాలను తొలగించి, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మెయిటీ సామాజిక వర్గానికి చెందిన ఖేంచంద్‌ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయగా.. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించడం ద్వారా సామాజిక సమతుల్యతను పాటించింది. కుకీ సామాజిక వర్గం నుంచి నేమ్చా కిప్గెన్‌ను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాగా తెగకు ప్రాతినిధ్యం వహిస్తూ రెండో ఉప ముఖ్యమంత్రిగా లోసీ దీఖో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలకు ప్రభుత్వంలో కీలక పదవులు కల్పించడం ద్వారా అందరినీ కలుపుకుని వెళ్లాలనే సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అలాగే గోవిందాస్ కొంతౌజం కొత్త హోం మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించారు.

బలంగా ఎన్డీయే కూటమి
రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే (NDA) కూటమికి తిరుగులేని మెజారిటీ ఉంది. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీకి స్వయంగా 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి తోడు ఎన్పీపీ (06), ఎన్పీఎఫ్ (05), ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉండటంతో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త నాయకత్వం పట్ల బీజేపీ జాతీయ పరిశీలకుడు తరుణ్ చుగ్ హర్షం వ్యక్తం చేశారు.

మొదటి ప్రాధాన్యత శాంతికే..
బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేంచంద్ తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. “మణిపూర్‌లో గత కొన్నేళ్లుగా ఉన్న అశాంతిని దూరం చేసి, అభివృద్ధి పథంలోకి నడిపించడమే మా ప్రభుత్వ లక్ష్యం. కులమతాలకు అతీతంగా ‘వికసిత్ మణిపూర్’ కోసం శ్రమిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related