Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం, మహిళా సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి కృషి చేస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు వడ్డీ లేని బ్యాంకు రుణాలను అందిస్తోంది. అంతేకాదు వారితో వివిధ వ్యాపారాలను చేయించడానికి కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.
మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చే ఏపీ ప్రభుత్వ ప్లాన్
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అరకు కాఫీకి ఉన్న డిమాండ్ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో అనేక ముఖ్యమైన ప్రాంతాలలో కాఫీ కార్నర్ లను ఏర్పాటు చేయిస్తున్న ప్రభుత్వం తాజాగా నిరుద్యోగ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన సహాయాన్ని అందిస్తూ శుభవార్త చెబుతోంది.
ఎగ్ మార్ట్ ల ఏర్పాటుకు రెడీ
మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం ఎగ్ మార్ట్ ల ఏర్పాటుకు రెడీ అయింది. ఈ మాటల ద్వారా మహిళలు గుడ్లను విక్రయించి లాభాలను పొందవచ్చు. ఈ పథకం కింద మహిళలకు కావలసిన బండిని, గుడ్లను విక్రయించడానికి కావలసిన ఇతర సామాగ్రిని ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తుంది. 50వేల రూపాయల విలువైన సామాగ్రిని ఇచ్చి మహిళల వ్యాపారం చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనిద్వారా రూపాయి పెట్టుబడి లేకుండా మహిళలు ఆదాయాన్ని సంపాదించవచ్చు.
నెక్ తో మెప్మా ఒప్పందం
రాష్ట్రంలో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు మరియు ముఖ్య కూడళ్ల వద్ద ఈ ఎగ్ మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు. ఇది మహిళలకు అమ్మకాలను పెంచి, తద్వారా అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని ఒక అంచనా ఉంది. అంతేకాదు ఈ వ్యాపారం చేయడం కోసం మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ పథకం అమలు కోసం మెప్మా నెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
ఇందులో వీరికి అధిక ప్రాధాన్యత
ఈ పథకం ద్వారా వ్యాపారం చేయాలనుకునే మహిళలు మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అందులో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులను ఒంటరి మహిళలకు ఈ కార్యక్రమంలో అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇక ఆసక్తి కలిగిన మహిళలు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితానికి బంగారు బాట వేసుకోవచ్చు.


