India
oi-Bomma Shivakumar
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ డీల్ ప్రకారం.. అమెరికాలో భారతీయ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గనున్నాయి. అయితే భారత్- అమెరికా ట్రేడ్ డీల్ పై వచ్చేవారం ఉమ్మడి ప్రకటన రానుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అలాగే రాబోయే ఐదేళ్లలో అమెరికా నుండి కనీసం 500 బిలియన్ డాలర్ల (రూ. 42 లక్షల కోట్లు) విలువైన వస్తువులను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు.
భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కు సంబంధించి తొలి దశ ప్రక్రియ దాదాపు పూర్తయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ మేరకు వచ్చే 4-5 రోజుల్లోనే ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. అలాగే మార్చి మధ్య నాటికి అధికారిక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య జరిగిన అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇది మొదటి పేజీ అని గోయల్ పేర్కొన్నారు.
ఈ మేరకు భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై గోయల్ హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుందని పేర్కొన్నారు. వాణిజ్య పరంగా అనేక అవకాశాలను ఈ డీల్ ఇస్తుందన్నారు. ఈ మేరకు అమెరికాతో వెరీ గుడ్ డీల్ జరిగిందన్నారు. ఈ ఒప్పందంతో భారత్ లోని రైతులు ఏమాత్రం నష్టపోరని పేర్కొన్నారు. భారత్ కు మున్ముందు శుభ ఫలితాలు సమకూరుతాయని పీయుష్ గోయల్ తెలిపారు.
ఇక భారత్ పై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ట్రంప్ .. భారత్ కు చెందిన ఉత్పత్తులపై ఇక నుంచి అమెరికాలో 18 శాతం సుంకాలు మాత్రమే ఉంటాయి అని పోస్టు చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపినట్టు ట్రంప్ పేర్కొన్నారు.


