నేడు టీటీడీ ఈఓగా ముద్దాడ ఛార్జ్: ఫస్ట్ టాస్క్.. !!

Date:


Andhra Pradesh

oi-Chandrasekhar Rao

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 68,586 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,764మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.71 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తొమ్మిది కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 12 గంటల సమయం పట్టింది.

కాగా- టీటీడీ కొత్త కార్యనిర్వహణాధికారిగా బదిలీ అయిన సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర.. నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఉదయం సరిగ్గా 10:08 నిమిషాలకు.. తాత్కాలిక ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి నుంచి బాధ్యతలను స్వీకరిస్తారు. శ్రీవారి ఆలయం ఆవరణలో ఈ కార్యక్రమం జరుగనుంది. అంతకుముందు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. అనంతరం రోజువారీ సమీక్ష సమావేశాలు, తిరుమలలో ఈ నెల 26న ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించే అవకాశం ఉంది.

బాధ్యతలను స్వీకరించడానికి గురువారం రాత్రే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. గాయత్రి నిలయం అతిథి గృహంలో బస చేశారు. సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ మురళీకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. మర్యాదపూరకంగా కలిశారు.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం తలెత్తిన అనంతరం బదిలీ వేటును ఎదుర్కొన్న రెండో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. తొలుత శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సింఘాల్ టీటీడీ ఈఓగా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు ఆయనపై కూడా వేటు పడింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సింఘాల్ ను తప్పించింది. గతంలో ఈవోగా పని చేసిన సమయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందీ నివేదిక.

కాగా- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 2వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రతీ రోజూ సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు తెప్పపై విహరిస్తారు. అశేష భక్తజనులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.

రెండవ రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడోవరోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 1న అయిదుసార్లు, చివరి రోజు 2వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, 28వ తేదీ.. అలాగే 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related