Andhra Pradesh
oi-Lingareddy Gajjala
పరామర్శల పేరుతో గుంటూరు వెళ్లేందుకు 6 గంటలు పట్టేలా వ్యవహరించారని వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. మందిని పోగేసి ర్యాలీ పేరుతో మరే వాహనాలు వెళ్లకుండా వాహనదారులను ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తిని తొక్కించేశారని.. బంగారుపాళ్యంలో మామిడి కాయలను కిందపడేసి తొక్కించేసి రౌడీయిజం చేశారని నిప్పులు చేరిగారు. వైసీపీ నేతలు బలప్రదర్శన ఎన్నికల సమయంలో చేయాలని సూచించారు. ప్రజా సమస్యల కోసం పోరాడకుండా రాజకీయం కోసమే బలప్రదర్శన చేస్తున్నారన్న సీఎం.. ఈ తరహా రాజకీయాన్ని ఎదుర్కోవటం నాకు తెలుసని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా భూ పరిపాలన సంస్కరణలపై సీఎం విస్తృతంగా మాట్లాడారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రాజముద్రతో కూడిన భూ యాజమాన్య పత్రాలు ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. భూమి అనేది రైతుకు అమ్మతో సమానమని, భూమితో ఉన్న అనుబంధాన్ని ఎవరూ చెరపలేరని పేర్కొన్నారు. భూ రికార్డులు తారుమారు కాకుండా విశిష్ట భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని తెలిపారు.
గత పాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూవివాదాలు సృష్టించి, 22ఏ కింద పెట్టి భూములను కాజేసే ప్రయత్నాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. పులివెందుల నుంచి తెచ్చిన వ్యక్తులతో గ్రామాల్లో భయాందోళనలు సృష్టించి లక్షల ఎకరాలు దోచుకున్నారని విమర్శించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లు, పిల్లల స్కూల్ బ్యాగులపై కూడా ఫోటోలు వేసుకున్నారని, ఇందుకోసం రూ.700 కోట్లు ఖర్చు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు.
తారుమారు చేస్తే జైలుకే: CM Chandrababu
ప్రజల నుంచి వస్తున్న అర్జీల్లో 80 శాతం భూవివాదాలకు సంబంధించినవేనని సీఎం తెలిపారు. గతంలో ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా మార్చి స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్న ఉదాహరణలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్ పుస్తకాలను ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. భూ రికార్డులను ఎవరైనా తారుమారు చేస్తే జైలుకు పంపేలా నిబంధనలు తీసుకొచ్చామని చెప్పారు.
డిసెంబరు నాటికి పూర్తి..
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 9వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ నెలలో 279 గ్రామాల్లో సర్వే చేసి 1.16 లక్షల మందికి పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని, ఏప్రిల్ నాటికి 18 లక్షలు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. 2027 డిసెంబరు నాటికి వందశాతం పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడమే లక్ష్యమన్నారు.
కరవుతో అల్లాడిన రాయలసీమ..
రాయలసీమ అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి సారించారు. గతంలో కరవుతో అల్లాడిన రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చామని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ సహా పలు ప్రాజెక్టుల ద్వారా నీరు అందిస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో సాగునీటి కోసం రూ.72 వేల కోట్లు ఖర్చు చేస్తే, గత పాలకులు కేవలం రూ.2 వేల కోట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును గోదాట్లో ముంచి, డయాఫ్రామ్ వాల్ దెబ్బతీయడం ద్వారా భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
పోలవరం, అమరావతి నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరు, శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించామని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యమన్నారు.
సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెప్పారు..
కల్తీ ప్రసాదంతో శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఐదేళ్ల పాటు రసాయనాలతో తయారైన కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయించారు. బాత్రూంలను శుభ్రపరిచేందుకు వినియోగించే రసాయనాలతో ఆ నెయ్యి తయారు చేయించి లడ్డూల్లో వాడారు. నెయ్యి కల్తీ కాలేదని సీబీఐ, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు.. కానీ వాళ్ల బాబాయి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెప్పారు. కల్తీ ప్రసాదంతో టీటీడీని అపవిత్రం చేస్తే దానిని సరిదిద్దే ప్రయత్నం చేశాను. గతంలో లడ్డూకి, ఇప్పుడు అందించే లడ్డూకు చాలా వ్యత్యాసం ఉంది. – సీఎం చంద్రబాబు.
మొత్తంగా, గత పాలనలో జరిగిన అక్రమాలు, భూవివాదాలు, అభివృద్ధి లోపాలను ప్రజల ముందు ఉంచిన చంద్రబాబు, ప్రస్తుత ప్రభుత్వం భద్రత, అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టే రాజకీయ బలప్రదర్శనలకు తాను తగిన విధంగా సమాధానం చెబుతానని హెచ్చరించారు.


