Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. మున్సిపల్ ఎన్నికలలో కేంద్రమంత్రి బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి పార్టీల పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
కేసీఆర్ ను టార్గెట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్లోని చొప్పదండిలో మాట్లాడిన ఆయన తాను అబద్ధాలు చెప్పనని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని అందుకే తనకి ఇప్పటివరకు బీపీ,షుగర్ అంటే ఎటువంటి రోగాలు రాలేదని పేర్కొన్నారు. తాను గట్టిగా పోరాడటం కారణంగానే కెసిఆర్ కు బీపి, షుగర్ వచ్చాయని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రజలు మాయ మాటలు నమ్మొద్దు అని, బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వెయ్యాలి
కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు చొప్పదండిసహా మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ నిధులను తీసుకొచ్చి తాము అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఎన్నికలొస్తున్నాయని తెలిసినా నిధులు విడుదల చేయలేదని బండి సంజయ్ ఆరోపించారు.
కేంద్ర నిధుల వల్లే అభివృద్ధి, కాంగ్రెస్ హామీలేమయ్యాయి
ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీ, అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తోందంటే అది పూర్తిగా కేంద్ర నిధుల వల్లేనని బండి సంజయ్ తెలిపారు.
కేంద్రం ఏమేం ఇచ్చిందో చెప్పిన బండి సంజయ్
చొప్పదండిలో అమృత్-2 పథకం ద్వారా రూ.36.30 కోట్లు, 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.5.57 కోట్లు, స్వచ్ఛ భారత్ పథకం ద్వారా రూ.42.66 లక్షలు కేంద్రం మంజూరు చేసిందన్నారు. స్వనిధి పథకం ద్వారా 1,611 మందికి రూ.2.94 కోట్ల రుణాలు అందాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లు అందించడంతో పాటు పరీక్ష ఫీజును తానే చెల్లించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తు చేశారు.
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాం
చొప్పదండి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆగిపోయిన మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామని, ఇంటింటికీ తాగునీరు, కొత్త రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల అభివృద్ధి, కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.


