International
oi-Syed Ahmed
బంగ్లాదేశ్ (Bangladesh)లో ప్రధాని షేక్ హసీనాను తిరుగుబాటుతో గద్దెదింపిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘన విజయం సాధించింది. మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రహ్మాన్ (tarique rahman) నేతృత్వంలోని బీఎన్పీ సాధించిన భారీ విజయం అక్కడి ప్రజల ఆలోచనలకు అద్దం పడుతుండగా.. పొరుగున ఉన్న భారత్ కు హెచ్చరికలు పంపేలా ఉంది. దీని వెనుక కారణాంలేంటో ఓసారి చూద్దాం..
బంగ్లా ఎన్నికల్లో బీఎన్పీ భారీ విజయం
బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో (bangladesh elections) బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) అఖండ విజయం సాధించింది. 2024లో జెన్ జడ్ నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత నిన్న నిర్వహించిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. 300 సీట్లున్న బంగ్లా పార్లమెంట్ లో ఒక అభ్యర్ధి మృతితో 299 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ఇందులో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 151 సీట్ల మార్కును దాటి 200 సీట్లకు పైగా స్ధానాల్లో భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. తారిఖ్ రెహ్మాన్ తాను పోటీ చేసిన ఢాకా, బొగురా స్ధానాల్లో విజయం సాధించారు. మరోవైపు బీఎన్పీకి ప్రత్యర్ధిగా నిలబడిన జమాతే ఇస్లామీ దాదాపు 50 సీట్లకే పరిమితమవుతోంది.
బంగ్లా ఫలితాలపై మోడీ రియాక్షన్
బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేకిగా, పాకిస్తాన్ అనుకూల పార్టీగా ముద్రపడిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించడంపై వివిధ దేశాలు స్పందిస్తున్నాయి. ఇదే క్రమంలో భారత ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీఎన్పీని నిర్ణయాత్మక విజయం దిశగా నడిపించినందుకు తారిక్ రెహమాన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఫలితం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల మరియు సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారతదేశం తన మద్దతును కొనసాగిస్తుందన్నారు. మన బహుముఖ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
আমি বাংলাদেশে অনুষ্ঠিত সংসদীয় নির্বাচনে বিএনপিকে নির্ণায়ক বিজয়ের অভিমুখে নেতৃত্ব দেওয়ার জন্য জনাব তারেক রহমানকে আন্তরিক অভিনন্দন জানাই।
এই ফলাফল আপনার নেতৃত্বের প্রতি বাংলাদেশের জনগণের আস্থার প্রতিফলন।
ভারত একটি গণতান্ত্রিক, প্রগতিশীল ও অন্তর্ভুক্তিমূলক বাংলাদেশের পক্ষে তার…
— Narendra Modi (@narendramodi) February 13, 2026
భారత్ కు ఎదురుదెబ్బ?
మరోవైపు బంగ్లాదేశ్ లో బీఎన్పీ విజయం భారత్ కు ఎదురుదెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ భారత్ కు అనుకూలంగా ఉంటే షేక్ హసీనాతో పోటీ పడి మరీ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మన దేశాన్ని వ్యతిరేకించేవారు. ఇప్పుడు ఆమె కుమారుడి నేతృత్వంలో ఉన్న బీఎన్పీ విజయం సాధించడం భారత్ కు ఇబ్బందికరమే. అయితే అతివాద జమాతే ఇస్లామీతో పోలిస్తే బీఎన్పీ విజయం భారత్ కు కాస్త ఊరట అనే చెప్పవచ్చు.


