Telangana
oi-Bomma Shivakumar
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలుచుకున్న వార్డుల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2,995 వార్డులకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 1,537 వార్డుల్లో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ 781, బీజేపీ 336, ఎంఐఎం 70, బీఎస్పీ 2, సీపీఎం 13, ఇతర పార్టీలు 73, స్వతంత్రులు 183 చోట్ల విజయం సాధించారు.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పోలయ్యాయో ఎస్ఈసీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ కు 39.08 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. అలాగే బీఆర్‌ఎస్ కు 28.75 శాతం, బీజేపీకు 15.67 శాతం, స్వతంత్రులకు 8.30 శాతం, ఎంఐఎంకు 3.28 శాతం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి 1.5 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం, జనసేనకు 0.3 శాతం ఓట్లు నమోదైనట్లు తెలిపారు.
ఇక తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో ఈనెల 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 1,347 వార్డుల్లో విజయం సాధించి 66 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక బీఆర్‌ఎస్ 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీల్లో విక్టరీ కొట్టింది. అలాగే బీజేపీ అభ్యర్థులు 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. ఇక 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే మిగతా స్థానాల్లో హంగ్ ఏర్పడింది. దాంతో ఆయా ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు మంత్రులు, సీనియర్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా 38 హంగ్ మున్సిపాలిటీలపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 20కు పైగా హంగ్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాయని సమాచారం.


