Andhra Pradesh
oi-Lingareddy Gajjala
మేడారం జాతర వేళ చోటుచేసుకున్న ‘కోవా బన్’ వివాదం ఇప్పుడు కేవలం ఒక వ్యాపారి సమస్యగా మిగలకుండా, రాష్ట్రవ్యాప్త చర్చాంశనీయంగా మారింది. మతం రంగు పులిమిన ఒక యూట్యూబ్ ఛానల్ అతి ఉత్సాహంపై అటు నెటిజన్లు, ఇటు రాజకీయ వర్గాల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని అనేకమంది చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. అందులో ఒకరు వలీ. కేవలం రూ. 10లకే కోవా బన్‌ను విక్రయిస్తున్న సమయంలో ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు చేసిన అత్యుత్సాహం ఈ చిరు వ్యాపారిని మానసిక వేదనకు గురిచేసింది.
అనుమానం నుండి మత విద్వేషం వరకు..
“ఇంత తక్కువ ధరకు కోవా బన్ ఎలా ఇస్తావు? ఇందులో ఏవైనా హానికరమైన పదార్థాలు కలిపావా?” అంటూ సదరు యూట్యూబర్ వలీని ప్రశ్నించడమే కాకుండా, అతని మతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. వ్యూస్, లైక్స్ కోసం ఒక శ్రమజీవి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, సమాజంలో విద్వేషాన్ని రగిల్చేలా ఆ ఇంటర్వ్యూ సాగడంతో సోషల్ మీడియా భగ్గుమంది. “నిజాయితీగా వ్యాపారం చేసుకునే వాడిని ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ, ఇలా కులమతాలను అంటగట్టడం దారుణం” అని నెటిజన్లు సదరు ఛానల్‌పై విరుచుకుపడ్డారు.
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!… https://t.co/AvckML9odY
— Lokesh Nara (@naralokesh) February 15, 2026
రంగంలోకి మంత్రి నారా లోకేష్!
ఈ వివాదం సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది. దీనిపై ఆయన ఎంతో సున్నితంగా, అంతే శక్తివంతంగా స్పందించారు. వలీకి అండగా నిలుస్తూ లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
“ప్రియమైన సోదరుడు వలీ.. నువ్వు ఎదుర్కొన్న ఈ వివక్షకు నేను ఎంతో బాధపడుతున్నాను. సామరస్యానికి, సోదరభావానికి మారుపేరైన మన తెలుగు సమాజంలో ఇటువంటి మతపరమైన చిచ్చులకు తావులేదు. నేను త్వరలోనే నిన్ను కలిసి, నీ ఫేమస్ కోవా బన్‌ను రుచి చూస్తాను. మేమంతా నీకు తోడుగా ఉన్నాం!” అని లోకేష్ హామీ ఇచ్చారు.
యూట్యూబ్ ఛానల్ పై చర్యలకు డిమాండ్
లోకేష్‌తో పాటు రాయలసీమకు చెందిన టీడీపీ నాయకులు, పలువురు సామాజిక కార్యకర్తలు వలీకి భారీ మద్దతు ప్రకటించారు. కేవలం ఒక చిరు వ్యాపారిని టార్గెట్ చేసి, మత విద్వేషాలను ప్రేరేపించిన సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనతోనైనా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదైనా చేసే ‘డిజిటల్ క్రియేటర్లు’ తమ పరిధిని గుర్తుంచుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఒక సామాన్య వ్యాపారి వెనుక ప్రభుత్వం మరియు సమాజం నిలవడం ఒక ఆశాజనక పరిణామం.


