కోవా బన్ వలీకి మెగా సపోర్ట్.. ఆర్ధిక సాయం చేసి, అండగా ఉంటామని హామీ!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

తెలుగు రాష్ట్రాల్లో కోవా బన్ వ్యవహారం చర్చనీయాంశం అయింది తెలిసిందే. ఇటీవల కర్నూలుకు చెందిన కోవా బన్ వలీపైన మేడారం జాతరలో యూట్యూబర్లు వ్యవహరించిన తీరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. చిరు వ్యాపారి వలీ ఫుడ్ జీహాదీ అంటూ టార్గెట్ చేసిన యూట్యూబర్లు ఆ ఆహారంలో ఏదో కలిపారని వలిని టార్గెట్ చేశారు.

కోవా బన్ వలీకి నాగబాబు మద్దతు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో వలీకి రాజకీయ వర్గాల నుండి, వివిధ వర్గాల ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కే. నాగబాబు వలీకి తన మద్దతు ప్రకటించారు. చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు స్పష్టం చేశారు.

ఆర్ధిక సాయం అందించి అండగా ఉంటామని స్పష్టం

ఇటీవల మేడారం జాతరలో కోవా బన్ అమ్ముతూ ఇబ్బందులకు గురైన కర్నూలుకు చెందిన వలీకి వ్యక్తిగతంగా ఆయన రూ. 25,000 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
కొందరు అత్యుత్సాహవంతుల దాడితో వలీ శివరాత్రి రోజున కూడా వ్యాపారం చేయలేకపోయాడని నాగబాబు పేర్కొన్నారు. అతని కుటుంబం భయంతో వ్యాపారం నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు నాగబాబు.

మత కోణంలో చూడటం మంచిది కాదన్న నాగబాబు

చిన్న వ్యాపారులను భయపెట్టడం తగదని నాగబాబు అన్నారు. ఎవరికైనా ఎక్కడైనా సరే ఆహార నాణ్యత మీద సందేహాలు ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, చట్టబద్ధంగా వారిని సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనను మత కోణంలో చూడరాదని విజ్ఞప్తి చేశారు నాగబాబు. దేశ ఆర్థిక వ్యవస్థకు, 40 శాతం పట్టణ పేదల జీవనోపాధికి చిరు వ్యాపారుల పాత్ర కీలకమని నాగబాబు గుర్తుచేశారు.

వలీకి ప్రభుత్వం అండగా ఉంటుంది

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం ఈ దాడిని ఖండించడం అభినందనీయం అని నాగబాబు అన్నారు. వలీ వంటి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, భయం లేకుండా జీవనోపాధిని కొనసాగించాలని హామీ ఇచ్చారు.

వలీ ముస్లిం, మతకోణంలో చూడటం వలెనే రగడ

ఈ ఘటనలో వలీ ముస్లిం అని, కావాలని ఫుడ్ జీహాదీగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని, లేదంటే కోవా బన్ పది రూపాయలకే ఎలా వస్తుందని టార్గెట్ చేసిన యూట్యూబర్ లు మత కోణంలో చూడటం వల్లే ఇది ఇంత రగడ అయ్యింది. ఇప్పుడు వలీకి రాజకీయ నాయకుల నుండి విశేష మద్దతు లభిస్తుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related