Telangana
oi-Sai Chaitanya
ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రయాణ సమయంలో ఆధార్ కార్డును ఎక్కువ మంది గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నారు. కాగా, ఇప్పుడు ప్రయాణీకులకు ఇక నుంచి ఆధార్ తో అవసరం లేకుండా కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. దీని ద్వారా టికెట్.. ఆధార్ లేకుండా ఈ కొత్త నిర్ణయం మేరకు ఉచిత ప్రయాణం కొనసాగించే వెసులుబాటు మహిళా ప్రయాణీకులకు దక్కనుంది.
తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. నిరంతరం సమీక్ష చేస్తోంది. పథకాన్ని మరింత విస్తరించేలా కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటి వరకు మహిళలు ఆధార్ కార్డు చూపించిన తర్వాత కండక్టర్ నుంచి జీరో టికెట్ తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. అయితే కొంతమంది మహిళల ఆధార్ కార్డుల్లో పాత ఫొటోలు ఉండటంతో కండక్టర్లు అలాంటి వారిని నిర్ధారించుకోవడం కష్టంగా మారింది. దీంతో, ఉచిత ప్రయాణం చేసే మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన్ 2వ తేదీ నుంచి ఈ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడు రకాల స్మార్టు కార్డులను ప్రవేశ పెడుతున్నారు. ఈ స్మార్ట్ కార్డులను ఒక జిల్లాలోని మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేయాలని నిర్ణయించారు. తొలి దశ ప్రాజెక్టుగా దాదాపు 5 లక్షల మందికి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. దీని తయారీకి సుమారుగా రూ.75 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
జూన్ 2 నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ
ఈ స్మార్ట్ కార్డు జారీలో ప్రతి ప్రయాణికురాలికి 16 అంకెల యూఐడీ నంబర్ ఇస్తారు. ఆ కార్డు ముందు సైడ్ ఎడమ వైపు లబ్ధిదారు పేరు, గ్రామం, మండలం, జిల్లా తదితర వివరాలు ఉంటాయి. కుడివైపు ఫొటో ఉంటుంది. వెనక భాగంలో ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మందికి ఈ స్మార్ట్‌కార్డులు జారీ అవనున్నాయి. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ సహాకరంతో ప్రతీ మహిళకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ఈ స్మార్ట్ కార్డు చూపించి మహిళలు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయణం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ముంబయి, లక్నో నగరాల్లోని బస్సుల్లో స్మార్ట్‌కార్డు విధానాల్లో ఎలాంటి ఫీచర్లు అమలు చేస్తున్నారనే అంశం పైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. జూన్ 2 నుంచి స్మార్ట్ కార్డులు అందించనున్నారు.


