Andhra Pradesh
oi-Dr Veena Srinivas
రాజమండ్రిలో 14 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఘటన ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే కల్తీ పాల కారణంగానే ఒకేసారి వీరంతా అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఇప్పటికి నలుగురు మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పాలలో కల్తీ.. ఆస్పత్రిలో పలువురు చేరిక
రాజమండ్రి లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఈనెల 15వ తేదీ తర్వాత వాంతులు, మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం వంటి సమస్యలతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చేరారు. ఆసుపత్రి పాలైన ప్రతి ఒక్కరికి ఒకే వ్యక్తి పాలు సరఫరా చేయడం వల్ల పాలలో కల్తీ జరిగి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కల్తీ పాల కారణంగానే ఈ విధంగా జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.
శాసనసభలో కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
అయితే ఈ ఘటనలో నలుగురు చనిపోగా నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు.ఈ ఘటన పైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారని బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆ డెయిరీ నుండి వచ్చిన పాలతోనే
ఘటనకు కారణమైన పాల సరఫరా నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీ నుంచి జరిగిందని సీఎం వివరించారు. పాల నమూనా సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపినట్టు తెలిపారు. కల్తీ తేలితే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
శాసనసభలో కల్తీ పాల ఘటనపై మంత్రి స్పందన
మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో నలుగురు మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అసెంబ్లీలో వెల్లడించారు. మొత్తం 12 మంది ఆసుపత్రిలో చేరినట్టు అధికారులు చెబుతున్నారని, అందులో నలుగురు మృతిచెందగా, ప్రస్తుతం ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారని, వారిలో ఇద్దరికి వెంటిలేటర్ పైన చికిత్స అందుతోందని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారి పైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


