Telangana
oi-Chandrasekhar Rao
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ వ్యవహారం చిలికి చిలికి గాలీవానగా మారుతోంది. హైదరాబాద్ కే ఇది పరిమితం కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇది వివాదాస్పదమౌతోంది. జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పేదల నివాసాలను తొలగించడానికి పూనుకోవడం వివాదాస్పదమౌతోంది. ఇప్పటికే పరిసర ప్రాంతవాసులు, ఇళ్లను కోల్పోతున్న బాధితులు ప్రభుత్వాన్ని విమర్శిస్తోన్నారు.
ఇప్పుడు తాజాగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా ఈ ఉదంతంపై స్పందించారు. మూసీ సుందరీకరణ పేరుతో బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన తప్పుపట్టారు. దీన్ని ఖండించారు. పేదల ఇళ్లను కూల్చి గాంధీ విగ్రహం కోసం స్థలం సేకరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు. ఈ చర్య గాంధేయ విధానం కాదని తేల్చి చెప్పారు. అన్ గాంధీయన్ మూవ్ గా అభివర్ణించారు.
ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు తుషార్ గాంధీ. దీన్ని రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఎక్స్ అకౌంట్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇళ్లను కూల్చి మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను చేపట్ట కూడదని సూచించారు. ఒకవేళ బాపూ బతికి ఉంటే కూడా ఇదే చెప్పేవారని అన్నారు. తన పేరుతో ఇలాంటి పనులు చేయవద్దని స్పష్టం చేసేవారని తుషార్ గాంధీ పేర్కొన్నారు.
మూసీ నది తీరాన్ని గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే- బాపూ ఘాట్ గాంధీ సరోవర్ పేరుతో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్ముడి విగ్రహం, టవర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల్లో భాగంగా.. ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ సెంటర్ సమీపంలోని బాపూఘాట్ వైపున ఈ భారీ టవర్ నిర్మించి, రెండు ప్రాంతాలను ఎలివేటెడ్ గేట్‌వే నిర్మాణంతో అనుసంధానించాలనేది ప్లాన్.
Displacing residents to create space for a Gandhi statue is the most unGandhian action. My appeal to the CM of Telangana is to please not do it @revanth_anumula @TelanganaCMO Bapu would have said “Not in my Name, Stop it!”
— 🍉Tushar GANDHI🇵🇸 Manavta Meri Jaat (@TusharG) February 23, 2026
అలాగే- హిమాయత్ సాగర్ అప్రోచ్ రోడ్డును అత్తాపూర్‌కు కలుపుతూ ఒక కొత్త ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. దీనివల్ల- గాంధీ సరోవర్ చుట్టూ ఓ ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్‌ను సృష్టించినట్టువుతుంది. ఈ కారిడార్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఫలితంగా- నేరుగా ఎయిర్ పోర్ట్ కు రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. మంచినీటి సరఫరా- వరద నియంత్రణకు అనుగుణంగా మూసీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తుంది ప్రభుత్వం.


