పునర్వికకు పునర్జన్మ: మహా సంకల్పం నెరవేరింది!

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

“మానవత్వానికి మరణం లేదు.. కలిసికట్టుగా పోరాడితే సాధించలేనిది ఏదీ లేదు” అని తెలుగు ప్రజలు మరోసారి నిరూపించారు. గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు ‘పునర్విక'(Punarvika). ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల పసికందును రక్షించుకోవాలని అందరూ కంకణం కట్టుకున్నారు. సాధారణ ప్రజల నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెసర్ల వరకు ప్రతి ఒక్కరూ స్పందించి, చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తాన్ని సమకూర్చారు.

ఎట్టకేలకు ప్రాణదాత అయిన ఆ ఖరీదైన ఇంజెక్షన్ కోసం డబ్బు సిద్ధమవడంతో, పునర్వికకు పునర్జన్మ లభించినట్లయింది. ఈ శుభవార్తను చిన్నారి తండ్రి సురేష్ కుమార్ ఎంతో భావోద్వేగంతో పంచుకుంటూ, “ఈ రోజు నుంచి ఫండింగ్ ఆపేయండి.. ఎవ్వరూ దయచేసి అమౌంట్ డొనేట్ చేయొద్దు” అంటూ ఒక వీడియో ద్వారా దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజ్ఞప్తి చేశారు.

Punarvika కు కేంద్రం నంచి బైరెడ్డి శబరి సాయం..

ఈ పోరాటంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాత్ర మరువలేనిది. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్భార్‌లో పునర్విక తండ్రి సురేష్ తన ఆవేదనను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆమె, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపీ. నడ్డాతో సంప్రదింపులు జరిపి, ‘జాతీయ అరుదైన వ్యాధుల విధానం’ (NPRD) కింద భారత ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. “ప్రజల ఆరోగ్యమే నా మొదటి ప్రాధాన్యత.. పునర్విక త్వరగా కోలుకోవాలి” అని ఆకాంక్షిస్తూ, ఆ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ సహాయం చిన్నారి కుటుంబానికి కొండంత అండగా నిలిచింది.

పునర్విక కథ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగలి సురేశ్‌కుమార్‌, పుష్పావతి దంపతులకు 2025 మే 12న పునర్విక జన్మించింది. ఆరు నెలల వయసు వచ్చినా పాప కదలికలు లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తొలుత కర్నూలు ఆసుపత్రుల్లో, ఆపై హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించారు. అప్పుడే ఆ చిన్నారికి ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ’ (SMA) అనే అరుదైన జన్యుపరమైన సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ఇది వెన్నెముకలోని మోటార్ న్యూరాన్లను దెబ్బతీసి, కండరాల బలహీనతకు దారితీసే వ్యాధి. దీనివల్ల శ్వాస తీసుకోవడం, నడక, కదలికలు దాదాపు అసాధ్యమవుతాయి.

ఇంజెక్షన్ ధర అక్షరాలా రూ. 16 కోట్లు..

ఈ ప్రాణాంతక వ్యాధికి చికిత్సగా వైద్యులు సూచించిన ‘జోల్జెన్స్మా’ అనే ఇంజెక్షన్ ధర అక్షరాలా రూ. 16 కోట్లు. ఒక సామాన్య కుటుంబానికి ఇది ఊహకందని మొత్తం. కానీ, పట్టువదలని ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా ప్రజల సాయం కోరారు. వేల సంఖ్యలో దాతలు స్పందించి చిన్నారి చికిత్సకు దారి చూపారు. నిధి సమకూరిన నేపథ్యంలో, పునర్వికకు చికిత్స ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ఐక్యత ఒక పసిగుండెలో ప్రాణం పోసింది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related