Andhra Pradesh
oi-Chandrasekhar Rao
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకాలు చోటు చేసుకున్నాయి. భారీ మార్పులకు పార్టీ అగ్ర నాయకత్వం శ్రీకారం చుట్టింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. తాజాగా రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేసింది వైఎస్ఆర్సీపీ. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించింది. భారీగా మార్పులు చేర్పులు చేసింది.
తాజా కొత్త రిజినల్ కోఆర్డినేటర్ల నియామకాలు ప్రస్తుతం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకే పరిమితం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా మార్పులు ఉండే అవకాశాలు లేకపోలేదు. తాజాగా చోటు చేసుకున్న మార్పుల్లో నలుగురు మాజీ మంత్రులకు కీలక బాధ్యతలు లభించాయి. వారి సేవలను విస్తృతంగా వినియోంచుకోవడంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం దీనికి తెర తీసింది.
1. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ గా మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నియమితులయ్యారు.
2. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సమన్వయకుడిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు అపాయింట్ అయ్యారు.
3. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బాధ్యతలు.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు లభించాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గం ఓటుబ్యాంక్ అత్యంత బలంగా ఉన్న జిల్లాలు కావడంతో బొత్సకు ఈ బాధ్యతలను అప్పగించారు వైఎస్ జగన్.
4. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పగ్గాలు మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేతికి అందాయి.
ఈ నలుగురు కూడా ఆ జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ/లోక్ సభ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీ బలోపేతం చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా పార్టీ శ్రేణులను నడిపించాల్సి ఉంటుంది.


