అగ్రరాజ్యం అమ్ములపొదిలోకి అజేయ శక్తి.. హిరోషిమా బాంబు కంటే 20 రెట్లు పవర్‌ఫుల్!

Date:


International

oi-Jakki Mahesh

Minuteman III: మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. అమెరికా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. అత్యంత విధ్వంసకరమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) ‘మినిట్‌మ్యాన్ III’ని కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న తరుణంలో ఈ ప్రయోగం జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పరీక్షకూ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాలకూ సంబంధం లేదని.. ఇది ఏళ్ల క్రితమే నిర్ణయించిన షెడ్యూల్ అని అమెరికా వైమానిక దళం స్పష్టం చేసింది.

ప్రయోగం సక్సెస్
ఈ ప్రయోగం వెనుక ఉన్న సాంకేతికత, వ్యూహాత్మక ఉద్దేశం గురించి అమెరికా ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కీలక వివరాలను వెల్లడించింది. ‘GT 255’గా పిలిచే ఈ పరీక్షలో భాగంగా క్షిపణి దాదాపు 6,000 మైళ్ల దూరం ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ ఐలాండ్స్‌ వద్ద ఉన్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో తాకింది. క్షిపణిలోని రీఎంట్రీ వెహికల్స్ ఖచ్చితంగా పనిచేశాయని..యవస్థ మొత్తం అనుకున్న విధంగానే స్పందించిందని అధికారులు తెలిపారు. అణ్వాయుధ దళాల సంసిద్ధతను, విశ్వసనీయతను నిరూపించడానికి ఇటువంటి పరీక్షలు అవసరమని వారు పేర్కొన్నారు.

Photo Credit: X(Twitter)

అణుబాంబు కంటే 20 రెట్లు పవర్‌ఫుల్
అసలు ఈ ‘మినిట్‌మ్యాన్ III’ని ‘డూమ్స్‌డే మిస్సైల్’ లేదా ‘ప్రళయ క్షిపణి’ అని ఎందుకు పిలుస్తారంటే..దీని విధ్వంసక సామర్థ్యం అసాధారణమైనది. 1970లలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ క్షిపణి.. కాలక్రమేణా అనేక ఆధునిక హంగులను అద్దుకుంది. ఇది గంటకు 15,000 మైళ్ల వేగంతో (శబ్దవేగం కంటే కొన్ని రెట్లు ఎక్కువ) ప్రయాణించగలదు. అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే ఇది సుమారు 20 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. అంటే ఇది ఒక్కసారి ప్రయోగిస్తే ఒక పెద్ద నగరాన్ని క్షణాల్లో నామరూపాలు లేకుండా చేయగలదు.

అప్రమత్తంగా అమెరికా
ప్రస్తుతం అమెరికా తన రక్షణ వ్యవస్థలో భాగంగా సుమారు 400 మినిట్‌మ్యాన్ III క్షిపణులను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతోంది. వీటిని మోంటానా, నార్త్ డకోటా, వ్యోమింగ్‌లోని భూగర్భ క్షిపణి కేంద్రాలలో భద్రపరిచారు. ఈ క్షిపణులు అమెరికా అణ్వాయుధ త్రిశూలంలో ఒక ముఖ్యమైన భాగం. భూమిపై నుండి, ఆకాశం నుంచి (బాంబర్లు), సముద్రం లోపల నుండి (సబ్ మెరైన్లు) అణ్వాయుధాలను ప్రయోగించే అమెరికా సామర్థ్యంలో భూతల ఆధారిత వ్యవస్థగా ఇది కీలక పాత్ర పోషిస్తోంది.

పరోక్షంగా హెచ్చరికలు
ఇరాన్‌తో యుద్ధం తీవ్రతరమవుతున్న సమయంలో అమెరికా ఈ ప్రయోగాన్ని నిర్వహించడం వెనుక బలమైన వ్యూహాత్మక సందేశం ఉందని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. శత్రు దేశాలకు అమెరికా తన అణ్వాయుధ శక్తి నిరంతరం సిద్ధంగా ఉందనే సంకేతాన్ని పంపింది. ఏ దేశమైనా అమెరికాపై లేదా దాని మిత్రదేశాలపై దాడికి దిగితే ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ పరీక్ష పరోక్షంగా గుర్తుచేసింది. సాంకేతిక సమాచారాన్ని సేకరించడంతో పాటు, అగ్రరాజ్యం తన సైనిక పటిష్టతను నిరూపించుకోవడానికి ఇదొక శక్తివంతమైన వేదికగా నిలిచింది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related