Telangana
oi-Dr Veena Srinivas
నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ తర్వాత హైదరాబాద్ కు మరో తలమానికంగా నిలవబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… 350కోట్ల రూపాయలతో స్టేషన్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా పనులు జరుగుతున్నాయని, 16 లిఫ్టులు, 8 ఎస్కలేటర్లు, అత్యాధునిక పార్కింగ్, అధునాతన రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల కోట్ల రూపాయలతో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ
2027 చివరి నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల కోట్ల రూపాయలతో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మరో 384 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ద్వారా స్థానిక వస్తువులకు ప్రోత్సాహం అందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగం సరికొత్త పుంతలు తొక్కుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా నాంపల్లి స్టేషన్ ఆధునీకరణ
ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రైల్వే కేంద్రాలలో నాంపల్లి రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఈ స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్టేషన్‌ను పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా నాంపల్లి రైల్వే స్టేషన్
కొత్తగా విశాలమైన ప్రవేశద్వారాలు, ఆధునిక వెయిటింగ్ హాల్స్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.అలాగే స్టేషన్ పరిసరాలను శుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా ఉండేలా మారనుంది.
రైల్వే స్టేషన్ ఆధునీకరణతో రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు
ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ స్టేషన్ ఆధునీకరణతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని అధికారులు చెప్తున్నారు.హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడం వల్ల రైల్వే ప్రయాణం మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు.


