International
-Syed Ahmed
ఇరాన్ (Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం ఎనిమిది రోజులకు చేరుకుంది. అయినా ఇప్పట్లో ఫలితం తేలేలా కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్-అమెరికాతో పోలిస్తే ఎక్కువ దెబ్బలు గల్ఫ్ దేశాలకు తగులుతున్నాయి. ఇన్నాళ్లూ సైలెంట్ గా అమెరికా మద్దతుగా నెట్టుకొస్తున్న గల్ఫ్ దేశాలకు ఇప్పుడు ఇరాన్ రూపంలో అసలైన ప్రత్యర్థి ఎదురుకావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
గల్ఫ్ దేశాల దుస్ధితి (saudi arabia)
ఇరాన్ ఓవైపు తమ దేశాల్లోని అమెరికా బేస్ లతో ప్రారంభించి చమురు క్షేత్రాల వరకూ దాడులు చేస్తున్నా కిమ్మనలేని దుస్దితిలోకి గల్ఫ్ దేశాలు చేరుకున్నాయి. దీంతో రోజురోజుకీ గల్ఫ్ దేశాల్లో ఉన్న పౌరుల పరిస్ధితి దినదినగండంగా మారుతోంది. అలాగని ఇరాన్ పై ఎదురుదాడి చేయలేని పరిస్ధితుల్లో అవి ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునే ఇంటర్ సెప్టర్లను వాడుకోవడం మినహా ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కీలక మిత్రదేశం సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ తో తెరవెనుక సౌదీ చర్చలు
మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని నియంత్రించడానికి సౌదీ అరేబియా ఇరాన్‌తో నేరుగా సంప్రదింపులను (saudi arabia-iran talks) ప్రారంభించింది. ఈ యుద్ధం ఉధృతం కావడం ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి పెంచుతోందని యూరోపియన్ అధికారులు చెప్తున్నారు. దీంతో యూరప్ జోక్యంతో సౌదీ ప్రభుత్వం.. ఇరాన్ తో తెరవెనుక చర్చలు జరుపుతోంది. ఉద్రిక్తతలను తగ్గించి, సంఘర్షణ తీవ్రం కాకుండా నిరోధించేందుకు సౌదీ అధికారులు తాజాగా తమ దౌత్య గోప్య మార్గాన్ని మరింత అత్యవసరంగా ఉపయోగించారని తెలుస్తోంది. భద్రతా సంస్థలు, దౌత్యవేత్తలు ఈ చర్చలలో పాలుపంచుకున్నారు. ఈ ప్రయత్నాలకు పలు యూరోపియన్, మధ్యప్రాచ్య దేశాలు మద్దతు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు.
అమెరికాపై అసంతృప్తిగా గల్ఫ్ దేశాలు
అయితే, చర్చలలో ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారా అనేది తెలియలేదు. ఇరాన్ అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపేందుకు ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా, ఇరాన్ కూడా క్షిపణి, డ్రోన్ దాడులతో బదులిచ్చింది. అయితే తమపై ప్రతీకారం వద్దని గల్ఫ్ దేశాలు ఇరాన్‌ను కోరాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలు ఇరాన్‌పై అమెరికా లేదా ఇజ్రాయెల్ సైనిక దాడులకు తమ భూభాగాన్ని, గగనతలాన్ని ఉపయోగించకూడదని స్పష్టం చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కొనసాగుతుందని బహిరంగంగా ప్రకటించగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్ “బేషరతు లొంగుబాటు”ను మాత్రమే అంగీకరిస్తానని తాజాగా తెలిపారు.


