2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది!

Date:


India

oi-Lingareddy Gajjala

భారతదేశంలో ఇంకా అధికారికంగా పూర్తిస్థాయిలో వేసవి ప్రారంభం కాక ముందే.. తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ నెలాఖరులో కనిపించాల్సిన ఎండలు, ఈ ఏడాది 2026 మార్చి మొదటి వారంలోనే జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే ఈ ఏడాది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండబోతుందో అర్థమవుతోంది.

దేశవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 4 డిగ్రీలు నుంచి 8 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండటం గమనార్హం. పారిశ్రామికీకరణ పూర్వ స్థాయిలతో పోలిస్తే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు వరుసగా నాలుగో సంవత్సరం కూడా పెరుగుతూ రావడం, 2026ను అత్యంత వేడి సంవత్సరంగా మార్చేలా కనిపిస్తోంది.

ఎల్ నినో ఎఫెక్ట్: ముంచుకొస్తున్న వడగాలుల ముప్పు!

వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం, 2026 మధ్య నాటికి వాతావరణ పరిస్థితులు ‘లా నినా’ నుంచి ‘ఎల్ నినో’ వైపు మళ్లే అవకాశం ఉంది. చారిత్రక రికార్డులను పరిశీలిస్తే, భారతదేశంలో ‘ఎల్ నినో’ ప్రభావం ఉన్నప్పుడు తీవ్రమైన వడగాలులు వీయడమే కాకుండా, రుతుపవనాలలో అస్థిరత ఏర్పడి వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి నెల 1901 తర్వాత నమోదైన అత్యంత వేడి నెలల్లో ఒకటిగా నిలిచిందంటే, వేసవి కాలం ముందుకు సాగే కొద్దీ మే నెలాఖరు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటాయని IMD ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

2024 నాటి భీభత్సాన్ని మళ్లీ చూస్తామా?

కొందరు నిపుణులు 2026 వేసవిని 2024 నాటి రికార్డు స్థాయి వేడిమితో పోలుస్తున్నారు. ఆ సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వారాల తరబడి 50°C వద్దే నిలిచిపోయాయి. రాజస్థాన్‌లోని ఫలోడిలో 51 డిగ్రీలు, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు నమోదై జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇప్పుడు 2026లో కూడా మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో, రాబోయే రెండు మూడు నెలలు దేశం ఒక నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

అసాధారణంగా పెరుగుతున్న ఈ వేడిమి కేవలం మనుషులకే కాకుండా, వ్యవసాయం మరియు జలవనరులపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం పాటు కొనసాగే ఈ వడగాలుల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related