India
oi-Bomma Shivakumar
సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని, రోడ్డు ప్రమాదాల్లో గాయ పడిన వారిని, మృతి చెందిన వారిని అంబులెన్స్ లో తరలిస్తుంటారు. అలాగే బ్రెయిన్ డెడ్ కు గురైన ఓ మహిళను కూడా ఇటీవల అంబులెన్స్ లో తరలించారు. అయితే మార్గ మధ్యలో అంబులెన్స్ గుంతలో పడింది. దాంతో భారీ కుదుపులకు లోనైంది. దీంతో బ్రెయిన్ డెడ్ గా పేర్కొన్న ఆ మహిళలో చలనం వచ్చి బతికింది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ అంబులెన్స్ అదుపుతప్పి గుంతలో పడిన ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ ప్రాణాలతో లేచి కూర్చొంది. పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న వినీతా శుక్లా అనారోగ్యానికి గురైంది. అయితే భర్త కుల్దీప్ శుక్లా ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో బరేలీలోని ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు.
ఈ మేరకు బరేలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వినీత బ్రెయిన్ డెడ్ కు గురైంది. ఈ విషయాన్ని వైద్యులు తెలిపారు. ఇంటికి తీసుకెళ్లాలని తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆమెను కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. అంబులెన్స్ లో ఇంటికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్ అదుపు తప్పి గుంతలో పడిపోయింది. కొంత కుదుపులకు లోనైంది. దాంతో బ్రెయిన్ డెడ్ కు గురైన వినీత శరీరంలో చలనం వచ్చి లేచి కూర్చొంది. దాంతో అంతా షాక్ అయ్యారు.
వెంటనే ఆమెను ఫిలిభిత్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బ్రెయిన్ డెడ్ అయిన ఆ మహిళ అంబులెన్స్ కుదుపుల కారణంగా తిరిగి బతికినట్లు తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.


