Andhra Pradesh
oi-Lingareddy Gajjala
ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం కర్నూలులో రాష్ట్రంలోనే అత్యధికంగా 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలోని పలు ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
రాష్ట్రంలోని నందిగామ, అమరావతి, జంగమేశ్వరపురం, నంద్యాల, కడపలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 38 డిగ్రీల మార్కును దాటేశాయి. తీర ప్రాంతాలైన విశాఖపట్నం, తుని, నరసాపురం, కావలిలో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే.. జార్ఖండ్ నుంచి విదర్భ వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీస్తున్నాయి.
రాగల మూడు రోజుల వాతావరణ సూచన..
- ఉత్తర కోస్తా & యానాం: ఈరోజు, రేపు పొడి వాతావరణం ఉంటుంది. అయితే, ఎల్లుండి (ఆదివారం) ఉత్తర కోస్తాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- దక్షిణ కోస్తా & రాయలసీమ: ఈ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు వాతావరణం పొడిగానే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాబోయే నాలుగు రోజుల వరకు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ, ఆ తర్వాతి మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితి..
ఒక్క ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా వాతావరణం భిన్నంగా ఉంది. పశ్చిమ,మధ్య భారత దేశంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉండవచ్చు. మరోవైపు, ఉత్తర భారత దేశంలోని జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లో రాగల కొన్ని రోజుల పాటు తేలికపాటి వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ వెల్లడించింది. దక్షిణ భారత దేశంలో మాత్రం వాతావరణం పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగనుంది.


