India
oi-Syed Ahmed
అసోంలోని కోక్రఝార్ (కామాఖ్య) నుంచి తెలంగాణలోని చర్లపల్లి స్టేషన్ కు ప్రయాణించే కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (amrit bharat express) ఇవాళ ప్రారంభమైంది. అసోంలో ప్రధాని మోడీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అసోం, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించబోతోంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల భారత దేశ తూర్పు రాష్ట్రాల కనెక్టివిటీ మరింత మెరుగుపడినట్లయింది.
ప్రస్తుతానికి ఈ కోక్రఝార్-చర్లపల్లి అమృత్ భారత్ రైలును ఒకవైపు మాత్రమే నడుపుతున్నారు. త్వరలోనే రెండు వైపులా రాకపోకల్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఇవాళ అసోంలోని కోక్రఝార్ లో మధ్యాహ్నం 2.30కు ప్రారంభమైన ఈ అమృత్ భారత్ రైలు రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ఏపీలోని పలాసకు చేరుకుంటుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం రోడ్, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ఎల్లుండి ఆదివారం ఉదయం 8.30కు చర్లపల్లి చేరుకుంటుంది.
Strengthening rail connectivity across Assam & the Northeast!
3 new train services flagged off by PM @narendramodi Ji
🚆 Kamakhya–Charlapalli Amrit Bharat Express
🚆 Guwahati–New Jalpaiguri Express
🚆 Narangi–Agartala Express pic.twitter.com/7wj1QnCprK— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 13, 2026
ఈ లెక్కన మూడు రోజుల పాటు ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణం ఉంటుందన్న మాట. దీన్ని ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా నడిపి, లోటుపాట్లు పరిశీలించి ఆ తర్వాత రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించనున్నారు. అంతవరకూ ఇలా వన్ వే షెడ్యూల్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఐదు రాష్ట్రాల మీదుగా సాగే ఈ ప్రయాణం ప్రయాణికులకు మంచి అనుభూతి పంచుతుందని రైల్వేశాఖ చెబుతోంది. ఈ రైలును ప్రధాని మోడీ ప్రారంభించిన దృశ్యాల వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ లో షేర్ చేశారు.


