భారీగా పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు ?

Date:


Business

oi-Jakki Mahesh

మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్ని యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావంతో భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కంపెనీలు రోజుకు దాదాపు రూ.2000 కోట్ల చొప్పున నష్టపోతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు ఈ నష్టం?
గత 15 రోజుల్లోనే ముడిచమురు ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. భారత్ తన అవసరాలకు కావాల్సిన దాదాపు 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతోంది. సిస్టమాటిక్స్ అనే బ్రోకరేజ్ సంస్థ రిపోర్టు ప్రకారం.. ప్రస్తుతం పెట్రోల్ విక్రయంపై కంపెనీలకు లీటరుకు రూ.20 మేర నష్టం వాటిల్లుతుండగా.. డీజిల్ మీద అత్యధికంగా లీటరుకు రూ.45 నష్టం వస్తోంది. రోజువారీగా జరుగుతున్న రూ.2000 కోట్ల నష్టంలో, సుమారు రూ.1650 కోట్లు డీజిల్ విక్రయాల వల్ల, రూ.350 కోట్లు పెట్రోల్ విక్రయాల వల్ల సంభవిస్తున్నాయి. అంటే డీజిల్ అమ్మకం కంపెనీలకు మరింత భారంగా మారింది.

యుద్ధం, రవాణా ఛార్జీల ప్రభావం
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. చమురును రవాణా చేసే ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఫ్రైట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇప్పటివరకు తక్కువ ధరకు లభించిన రష్యన్ ముడిచమురు కూడా ఇప్పుడు ప్రీమియం ధరలకు లభిస్తుండటంతో చమురు సంస్థలపై భారం రెట్టింపు అయ్యింది.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
ప్రస్తుతానికి చమురు కంపెనీలు తమ సొంత నిధుల నుంచి ఈ నష్టాన్ని భరిస్తూ.. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ముడిచమురు ధరలు ఇదే రీతిలో కొనసాగితే.. కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలను పెంచక తప్పని పరిస్థితి రావచ్చు. ఇది సామాన్యులపై ద్రవ్యోల్బణ భారాన్ని పెంచే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరా విషయానికి వస్తే.. ఖతార్ నుంచి సరఫరాలో ఆటంకాలు ఏర్పడటం, అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ ధరలు 50 శాతం పెరగడం వంటి పరిణామాలు కూడా భారత గ్యాస్ మార్కెట్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related