International
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. యుద్ధం ప్రారంభం అయి రెండు వారాలు గడుస్తున్నా ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అటు అగ్రరాజ్యం సైతం హార్మూజ్ జల సంధితో పాటు ఇతర స్థావరాలకు బలగాలను మోహరిస్తోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 93 కోట్లు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొన్న కారణంగా ఇన్నాళ్లూ భారత్ తో పాటు ప్రపంచ దేశాలపై అధిక పన్నులు విధిస్తూ వచ్చిన అమెరికా.. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మాట మార్చినట్లు స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను అమెరికా అడుక్కుంటోందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
“రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపి వేసేందుకు కొన్ని నెలల పాటు భారత్ ను అమెరికా ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రెండు వారాలుగా యుద్ధం జరుగుతున్న క్రమంలో ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలను అమెరికా అడుక్కుంటోంది. ఇరాన్ పై అమెరికా కొనసాగిస్తున్న చట్టవ్యతిరేక యుద్ధాన్ని యూరోప్ సమర్థిస్తున్నాయి. తద్వారా రష్యాకు వ్యతిరేకంగా అమెరికా సపోర్ట్ మాకు ఉంటుందని ఆలోచన చేస్తున్నాయి. ఇది దురదృష్టకరమైన సందర్భం” అని ఇరాన్ విదేశాంగ మంత్రి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
The U.S. spent months on bullying India into ending oil imports from Russia. After two weeks of war with Iran, White House is now begging the world—incl India—to buy Russian crude.
Europe thought backing illegal war on Iran would win U.S. support against Russia.
Pathetic. pic.twitter.com/fbkrXpXa9P
— Seyed Abbas Araghchi (@araghchi) March 13, 2026
మార్చి 5.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు గాను భారత్ పై ఉన్న ఆంక్షలను 30 రోజుల పాట సడలిస్తూ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతపైనా కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ. ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధం చట్ట వ్యతిరేకమైనదిగా అభివర్ణించారు.
ఇక ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇరాన్- అమెరికా మధ్య అణు ప్రోగ్రామ్ పై డీల్ కోసం చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలు సఫలీకృతం కాలేదు. దాంతో ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఇరాన్ సైతం ఏమాత్రం తగ్గకుండా ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులను ప్రారంభించింది.


