India
oi-Chandrasekhar Rao
ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏదీ ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీదా దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వంట వండటానికి ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తోంది.
ఈ పరిణామాల మధ్య పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియా ముందుకువచ్చారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, ఇంధన లభ్యతను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ లభ్యత ఆందోళన కలిగిస్తున్నా, రిటైల్ స్టేషన్లలో నిల్వలు అడుగంటినట్లు ఫిర్యాదులు గానీ నివేదికలు గానీ అందలేదని స్పష్టంచేశారు.
ఎల్‌పీజీ లభ్యతను స్థిరీకరించడానికి, సిలిండర్ల అక్రమ నిల్వలను అరికట్టడానికి అవసరమైన చర్యలు వేగవంతం చేశామని ఆమె వివరించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్‌షిప్, రిటైల్ అవుట్‌లెట్లలో ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపట్టామని, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు. ఒక్క శుక్రవారం నాడే సుమారు 1,300 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు.
ఇటీవలి ఆదేశాలతో దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి పెరిగిందని, ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం నేడు ఉత్పత్తి 31 శాతం వరకు పెరిగిందని సుజాత శర్మ పేర్కొన్నారు. సరఫరా ఒత్తిళ్లను తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీనీ ప్రారంభించామని అన్నారు.
పట్టణ ప్రాంతాలలో చివరి డెలివరీ, తదుపరి బుకింగ్‌కు మధ్య 25 రోజుల కనీస గడువు తప్పనిసరి అని, గ్రామీణ ప్రాంతాలలో ఈ గడువు 45 రోజుల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్దేశిత గడువు ముగియనిదే బుకింగ్ సాధ్యం కాదని సుజాత శర్మ వివరించారు. గ్యాస్ బుకింగ్ కోసం వినియోగదారులు ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్, వాట్సాప్.. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అందించే మొబైల్ యాప్‌లు వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించుకోవాలని సుజాత శర్మ సూచించారు.
సిలిండర్ బుకింగ్ లేదా డెలివరీ కోసం వ్యక్తిగతంగా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎప్పటిలాగే సిలిండర్లను ఇంటి వద్దకే అందిస్తాయని, కాబట్టి ఆందోళన అనవసరమని ఆమె భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరత షార్టేజ్ వార్తల్లో వాస్తవం లేదని, డొమెస్టిక్ సిలిండర్లు నిర్దేశిత గడువులోగా వినియోగదారుల ఇంటివద్దకే అందుతాయని ఆమె పునరుద్ఘాటించారు.
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కొత్త ఉత్తర్వు జారీ చేసిందని, దీని ప్రకారం ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని పరిశ్రమలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర సంస్థలకు సహజ వాయువుకు బదులుగా బయోమాస్-డిరైవ్డ్ (రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ – RDF) పెల్లెట్లను ఒక నెల పాటు తాత్కాలికంగా ఉపయోగించడానికి అనుమతి లభించింది అని ఆమె పేర్కొన్నారు.


