Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఏపీ ప్రభుత్వ రాష్ట్రంలో అన్ని పౌర సేవలను సులభతరం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రజలకు కావలసిన అన్ని డాక్యుమెంట్లను whatsapp సేవల ద్వారా అందిస్తున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా కీలకమైన ఆరోగ్య సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
మన మిత్ర వాట్సాప్ నెంబర్ తో ఆరోగ్య సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కీలక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పౌరులు ఇకపైన సులభంగా వైద్య సేవలను పొందడానికి వీలు కలుగుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ నెంబర్ కు వాట్సప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీరు పొందవలసిన ఆరోగ్య సేవల మెనూ స్క్రీన్ పైన కనబడుతుంది.
ఆధార్ తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ తో లాగిన్
అందులో ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ అపాయింట్మెంట్ సేవలను పొందే వీలు కలుగుతుంది. దానిద్వారా సంబంధిత జిల్లా, ఆసుపత్రి విభాగం వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవరైతే ఏ విభాగంలో ఆరోగ్యసేవలను కోరుకుంటున్నారో వారు తమ ఆధార్ తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ తో ఓటిపి ద్వారా దీనికి లాగిన్ అయ్యి తమ పూర్తిపేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, చిరునామా, జిల్లా, పిన్కోడ్, రాష్ట్రం సహా అందులో అడిగిన వివరాలను నమోదు చేసుకోవాలి.
ఆన్ లైన్ లోనే వాట్సప్ ద్వారా అపాయింట్మెంట్
ఈ ప్రక్రియ తర్వాత ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాని చివరి 4 అంకెలు నమోదు చేయగానే మీకు ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. అందులో మీకు అలాట్ చేసిన సమయం కూడా ఇవ్వబడుతుంది. దీంతో కేటాయించిన సమయానికి అక్కడికి వెళ్లి వైద్య సేవలను పొందే వీలుంటుంది.
సమయం వృధా కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులలోనూ వైద్య సేవలు
గతంలో ఆసుపత్రులకు వెళ్లాలంటే పేషెంట్లు అక్కడికి వెళ్లి ఓపి కోసం క్యూలైన్లో నిలబడి ఓపి రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా సెల్ ఫోన్ లో నుంచి నేరుగానే ఓపి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, ఆ సమయానికి ఆసుపత్రికి వెళ్లి సమయం వృధా కాకుండా వైద్య సేవలను పొందవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే ఇబ్బంది పడిన పేషెంట్స్ ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.


