Telangana
oi-Dr Veena Srinivas
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం తరహాలో విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయాన్ని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోట్లాది రూపాయల వ్యయంతో పునర్నిర్మించింది. అత్యంత శోభాయమానంగా ఆలయం నిర్మాణం జరగడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని దర్శనం చేసుకోవడానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.
తిరుమల తరహాలో యాదాద్రి డిజిటలైజేషన్
సాధారణ రోజులలో నిత్యం 50వేల మంది భక్తులు వస్తుండగా, వారాంతాలు, పండుగ దినాలలో లక్ష మందికి పైగా భక్తులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటున్నారు.భక్తుల సందర్శన నిర్వహణతో పాటు, ఆలయ పరిపాలనలో పారదర్శకతను పెంచాలన్న లక్ష్యంతో తిరుమల తరహాలో డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. యాదాద్రి ఆలయాన్ని తిరుమల శ్రీవారి తరహాలో, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం కోసం, పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది.
త్వరలో డిజిటల్ యాదగిరి
ఈ క్రమంలోనే తిరుమలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అందిస్తున్న టిసిఎస్ ను దేవస్థానం సంప్రదించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అవసరమైన డిజిటల్ అప్లికేషన్లను అభివృద్ధి చేసి సేవలను అందించడం కోసం టిసిఎస్ అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో త్వరలోనే అత్యాధునిక డిజిటల్ సేవలతో డిజిటల్ యాదగిరి అందుబాటులోకి రానుంది.
అన్ని రకాల సేవలు ఆన్ లైన్ లోనే
ప్రస్తుతం ఈ మేరకు డి పి ఆర్ రూపకల్పనకు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. యాదాద్రి ఆలయ పరిపాలన నుండి భక్తులకు అందించే వసతుల వరకు అన్ని రకాల సేవలు ఆన్లైన్ ద్వారానే లభిస్తాయి. అంతేకాదు మొత్తం యాదగిరిగుట్ట దేవస్థానం పరిపాలనను పర్యవేక్షించే 14 విభాగాలు కూడా డిజిటలైజేషన్ కానున్నాయి.
డిజిటల్ పద్ధతిలో నిర్వహించేలా యాప్
యాదాద్రికి సంబంధించి కొనుగోలు, టెండర్లు, బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల జీత భత్యాల వంటి ముఖ్యమైన కార్యకలాపాలు కూడా డిజిటల్ పద్ధతిలో నిర్వహించేలా యాప్ ను రూపొందిస్తున్నారు. తిరుమల తరహాలో భక్తులకు మరింత సౌకర్యవంతంగా బ్రేక్ దర్శనాలు, అతి శీఘ్ర దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, ఆలయంలో భక్తులు జరిపించుకునే అన్ని రకాల ఆర్జిత సేవలు ముందుగానే ఆన్లైన్లో పొందే విధంగా రూపొందిస్తున్నారు.
రాబోయే ఆరు నెలలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి
ధర్మ దర్శనానికి కూడా స్లాట్ విధానం అమలులోకి తీసుకురావాలని, అవసరమైతే దానికి సైతం అప్లికేషన్స్ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. తిరుమల తరహాలో యాదాద్రి ఆలయానికి సంబంధించిన ప్రతి సేవ ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేశారు. డిజిటల్ యాదగిరి ఆన్లైన్ సేవల ద్వారా వసతి ఇతర సదుపాయాల సమాచారం కూడా భక్తులకు వేగంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సేవలు రాబోయే ఆరు నెలలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


