India
oi-Syed Ahmed
తమిళనాడు (tamil nadu)లో అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార డీఎంకే కూటమికీ, విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమికీ మధ్య సాగుతున్న పోరులోకి హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ నేత ఒకరు రజనీకాంత్ ను ఈ పోరులోకి లాగడంతో ఆయన నేరుగా స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే పోరులోకి మరో హీరోయిన్ వచ్చి చేరారు. ఆమే నయనతార.
ఎన్నికల వేళ స్టాలిన్ ప్రభుత్వం జనంలోకి వెళ్లేందుకు ఓ కీలక కార్యక్రమం చేపట్టింది. దీని పేరు “మీ కలను చెప్పండి”. తద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని, దాన్ని నెరవేర్చేందుకు సీఎం స్టాలిన్ దీన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కింద, వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పాలనపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తారు. అయితే దీన్ని విమర్శిస్తూ అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ సి.వి.షణ్ముగం చీప్ కామెంట్స్ చేశారు.
“మీ కలను చెప్పండి” కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగా “నాకు నయనతార కావాలి” అంటూ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ పథకాన్ని ఎద్దేవా చేస్తూ ఎంపీ ..”నాకు నయనతార కావాలి, మీరు ఆ కలను నెరవేరుస్తారా? నయనతారను పెళ్లి చేసుకోవాలనే ఎవరి కలను అయినా ఆయన (ఎంకే స్టాలిన్) నెరవేరుస్తారా?” మాజీ మంత్రి కూడా అయిన షణ్ముగం.. స్టాలిన్ కార్యక్రమాన్ని ఆక్షేపిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార డీఎంకే కూటమి పార్టీలతో పాటు సాధారణ ప్రజల్ని కూడా మంటపుట్టించేలా చేశాయి. డీఎంకే పాలనలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే చేపట్టిన నిరసనల సందర్భంగా షణ్ముగం తన సొంత నియోజకవర్గమైన విల్లుపురంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


