జగన్‌కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వైఎస్సార్ కుటుంబ ఆస్తుల వివాదం, ఇప్పుడు స్వయంగా జగన్ మాతృమూర్తి విజయమ్మ రంగంలోకి రావడంతో అత్యంత నాటకీయ మలుపు తిరిగింది. తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిపై, కుమార్తె షర్మిల పక్షాన నిలబడుతూ ఆమె విడుదల చేసిన అడ్వకేట్ నోటరీ.. వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల పంపకంపై సాగుతున్న ‘కురుక్షేత్రం’ ఇప్పుడు విజయమ్మ వాంగ్మూలంతో క్లైమాక్స్‌కు చేరుకుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో అన్నా చెల్లెళ్ల సవాల్‌లా సాగుతున్న ఈ వివాదంలో, విజయమ్మ విడుదల చేసిన అడ్వకేట్ నోట్ సంచలన విషయాలు బయటపడ్డాయి. తన కొడుకు జగన్, తన మేనల్లుడు మేనకోడలికి అన్యాయం చేశాడని, వైఎస్సార్ బతికున్నప్పుడు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె కుండబద్దలు కొట్టారు. దేవుడి సాక్షిగా తాను చెబుతున్నవన్నీ నిజాలేనని, జగన్ తన బాధ్యతను విస్మరించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్సార్ ఆజ్ఞ.. జగన్ ధిక్కారం!

విజయమ్మ తన లేఖలో అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. “వైఎస్సార్ తన ఆస్తులన్నీ తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని కోరుకున్నారు. ఇది కేవలం ఆయన కోరిక మాత్రమే కాదు.. అది ఆయన ఆదేశం కూడా” అని ఆమె స్పష్టం చేశారు. సరస్వతి సిమెంట్స్ మరియు యెలహంక భూమి కూడా న్యాయబద్ధంగా షర్మిలకే చెందాలని, జగన్ రాసిన ఎంవోయూ (MoU) కేవలం షర్మిల హక్కును గుర్తించడం మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి షర్మిలకు రావాల్సిన దానికంటే జగన్ తక్కువే రాశాడని, ఇప్పటి వరకు ఇచ్చానని చెబుతున్న డబ్బంతా కేవలం డివిడెండ్ మాత్రమేనని ఆమె అసలు గుట్టు విప్పారు.

మేనల్లుడికి అన్యాయం.. తల్లి ఆవేదన..

జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి తీవ్ర అన్యాయం చేశాడని విజయమ్మ నేరుగా ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “నిజం ఏమిటో ఆ దేవుడికి తెలుసు.. నా కొడుక్కి కూడా తెలుసు. ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకుని తన తోబుట్టువు పిల్లలకు న్యాయం చేస్తాడని ఒక తల్లిగా ఆశిస్తున్నాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత భావోద్వేగంగా సాగాయి. ఆస్తుల పంపకం అసలు జరగలేదని, వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ అందరికీ సమానంగా దక్కాల్సినవేనని ఆమె వాదించడం ద్వారా, జగన్ వాదనలోని డొల్లతను ఆమె బయటపెట్టారు.

విజయమ్మ రాసిన లేఖలో..

“2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణం తరువాత వచ్చిన ఆస్తులను కుటుంబ ఆస్తులు (combined family assets). ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగ లేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్‌ఆర్ ఉద్దేశ్యం. ఇది ఆయన ఆశయం కూడా. దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిది. MOUలో షర్మిలకు రాసిన ప్రతీ ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ MOU రాశాడు (నిజానికి తనకు తక్కువే రాశాడు). సరస్వతి సిమెంట్ తో సహా MOUలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. (ఇచ్చాను అన్ని చెబుతున్న డబ్బు షర్మిల వాటుకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే). ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగ లేదు. ఇప్పుడూ చదువుతున్న జగన్ షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్ కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏంటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు? మీరు ఎంత కాదన్న దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాలు ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నాను. దేవుని సాక్షిగా నేను రాసినన్ని వాస్తవాలు మాత్రమే.” – వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి.

ముదురుతున్న రాజకీయ సెగ..

వైకాపా నేతలు షర్మిలపై చేస్తున్న ఆరోపణలకు విజయమ్మ ఇచ్చిన ఈ స్పష్టత ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. తల్లి స్వయంగా రంగంలోకి వచ్చి కుమారుడిని తప్పుబట్టడం రాజకీయంగా జగన్‌కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్తుల గొడవ కాస్తా ఇప్పుడు ‘ధర్మం-అధర్మం’ మధ్య పోరాటంగా మారిపోయింది. ఈ అడ్వకేట్ నోటరీ ఇప్పుడు కోర్టులో మరియు ప్రజల ముందు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒక తల్లిగా తన బిడ్డల మధ్య సామరస్యం కోరుకుంటున్నానంటూనే, జగన్ చేసిన తప్పులను విజయమ్మ ఎండగట్టడం ఈ వివాదంలో మైలురాయిగా నిలిచిపోనుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related