Business
-Lingareddy Gajjala
బడ్జెట్ 2026–27 ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఒక ప్రకటన స్టాక్ మార్కెట్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. డెరివేటివ్స్ ట్రేడింగ్‌పై విధించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను భారీగా పెంచుతున్నట్లు ఆమె ప్రకటించగానే మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే నిఫ్టీ50 ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో 593 పాయింట్లు (2.33 శాతం) నష్టపోయి 24,825.45 వద్ద ముగిసింది. అదే సమయంలో సెన్సెక్స్ కూడా 1,843 పాయింట్లు (2.23 శాతం) పడిపోయి 80,722.94 వద్ద క్లోజ్ అయ్యింది. మార్కెట్‌లో ఒక్కసారిగా అమ్మకాల తుఫాను మొదలైంది.
బడ్జెట్ ప్రకారం, ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై STTను ఇప్పటి వరకు ఉన్న 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచనున్నారు. అంటే ఏకంగా 150 శాతం పెంపు. ఇక ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ప్రీమియంపై STTను 0.10 శాతం నుంచి 0.15 శాతానికి, అలాగే ఆప్షన్ ఎక్సర్‌సైజ్‌పై ఉన్న 0.125 శాతాన్ని కూడా 0.15 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పుల ఉద్దేశం ఒక్కటే అని ప్రభుత్వం చెబుతోంది – ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌లో పెరిగిపోయిన ఊహాగానాలకు బ్రేక్ వేయడం. ఎందుకంటే SEBI లెక్కల ప్రకారం పది మంది రిటైల్ F&O ట్రేడర్లలో తొమ్మిది మంది నష్టాల పాలవుతున్నారు.
అసలు STT అంటే ఏమిటి?
స్టాక్ మార్కెట్‌లో షేర్లు, ఫ్యూచర్స్, ఆప్షన్స్ కొనుగోలు–అమ్మకాలపై విధించే పన్నే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. లాభమొచ్చినా, నష్టమొచ్చినా, ప్రతి ట్రేడ్‌పైనా ఈ పన్ను కట్టాల్సిందే. ఇది 2004 అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. పన్ను ఎగవేతను అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం.
F&O ట్రేడింగ్ అంటే అసలు షేర్లను కొనడం కాదు. భవిష్యత్‌లో ఒక ధరకు కొనుగోలు లేదా అమ్మకం చేయాలనే ఒప్పందాలతో ట్రేడింగ్ చేయడమే. లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నా, రిస్క్ కూడా అంతే ఎక్కువ. అందుకే ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఖరీదైనదిగా మార్చాలని చూస్తోంది. ఈ STT పెంపు ట్రేడర్లపై ఎలా ప్రభావం చూపుతుంది అంటే – ఉదాహరణకు రూ.1 లక్ష విలువైన ఫ్యూచర్స్ ట్రేడుపై ఇప్పటివరకు రూ.20 STT చెల్లించేవారు. ఇప్పుడు అదే ట్రేడ్‌కు రూ.50 కట్టాల్సి ఉంటుంది. ఒక ట్రేడ్‌కు పెద్దగా అనిపించకపోయినా, రోజుకు పదుల సంఖ్యలో ట్రేడ్లు చేసే వారికి ఇది భారీ భారంగా మారుతుంది. లాభాలు క్రమంగా కరిగిపోతాయి.
భయమే కారణం..
ఈ ప్రకటన తర్వాత బ్రోకరేజ్, ఎక్స్ఛేంజ్ సంబంధిత షేర్లు తీవ్రంగా పడిపోయాయి. బీఎస్‌ఈ లిమిటెడ్, ఏంజెల్ వన్, గ్రోవ్ పేరెంట్ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ వంటి స్టాక్స్ 13 శాతం వరకు కుప్పకూలాయి. డెరివేటివ్స్ ట్రేడింగ్ తగ్గితే ఈ కంపెనీల ఆదాయం తగ్గుతుందనే భయమే ఇందుకు కారణం.
మార్కెట్ నిపుణుల మాటల్లో చెప్పాలంటే, STT పెంపు పూర్తిగా ఊహించని పరిణామం. క్యాపిటల్ గెయిన్స్ పన్ను తగ్గింపుపై ఉన్న ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు భయపడి అమ్మకాలకు దిగారని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక మూడు కారణాలు చెబుతోంది. ఒకటి .. రిటైల్ ఇన్వెస్టర్లను అధిక రిస్క్ ఉన్న ట్రేడింగ్ నుంచి దూరం పెట్టడం. రెండు.. డెరివేటివ్స్ విభాగం నుంచి ఎక్కువ పన్ను ఆదాయం పొందడం. మూడు – ప్రజలు క్యాష్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మళ్లేలా చేయడం.
మొత్తానికి, బడ్జెట్‌లో STT పెంపు ఒక్క ప్రకటనతోనే మార్కెట్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై F&O ట్రేడింగ్ చేసే వారు ప్రతి ట్రేడ్ ముందు ఖర్చులు, రిస్క్‌ను మరింత జాగ్రత్తగా లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


