Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)మరోసారి 1995 నాటి ముఖ్యమంత్రిని గుర్తుచేశారు. అధికారుల విషయంలో తాను ఎలా ఉంటానో మరోసారి చూపించారు. ఇవాళ నంద్యాల జిల్లా డోన్ లో జరిగిన బహిరంగసభలో ప్రజల సమక్షంలో అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఓ భూమి విషయంలో అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. తాను నేరుగా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తానని హెచ్చరించారు.
వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బాధితుణ్ణి అంటూ డోన్ సభలో ప్యాపిలీ మండలానికి చెందిన పొలెం రామచంద్ర అనే వ్యక్తి సీఎం చంద్రబాబుకు ఓ సమస్య నివేదించారు. 110 ఏళ్ల నుంచి తమ ఆధీనంలో ఉన్న భూమిని బుగ్గన తన అనుచరులకు కట్టబెట్టారని సీఎంకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఆర్డీఓ, తాసీల్దార్ సహా చాలా మందికి కంప్లైంట్లు చేసినా… సమస్య పరిష్కారం కాలేదని రామచంద్ర చెప్పారు.
దీంతో వెంటనే వేదిక మీదకు డోన్ ఆర్టీఓను పిలిపించిన ముఖ్యమంత్రి..సమస్య పరిష్కరించకుండా, బాధితుడికి న్యాయం చేయకుండా ఎందుకు తిప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. బుగ్గన బాధితుడైన రామచంద్ర ఫిర్యాదును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, న్యాయం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. రామచంద్ర చేసిన ఫిర్యాదును అన్ని కోణాల్లో పరిశీలిస్తానని, ఏమైనా తేడా చేసినట్టు తేలితే ప్రమాదంలో పడతారంటూ ఆర్డీఓకు సీఎం హెచ్చరికలు చేశారు. ఈ ఫిర్యాదును స్టడీ చేసి, వెంటనే మంత్రికి నివేదిక ఇవ్వాలని వేదిక మీద నుంచే ఆదేశించారు.
రైతుల భూములను వేరే వాళ్లు ఆక్రమిస్తే చాలా కఠినంగా శిక్షిస్తానని సీఎం వెల్లడించారు. ఇలాంటి ఆగడాలు అరికట్టాలనే ప్రత్యేక చట్టం తెచ్చామని, పీడీ యాక్ట్ పెట్టి, శాశ్వతంగా జైల్లో ఉండేలా చేస్తామని హెచ్చరించారు. రాబోయే కాలంలో ఏ అధికారి తప్పు చేసినా, గ్రామ పంచాయతీల్లోనే వారి గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. ప్రజల మధ్యనే ఇకపై సమస్యల పరిష్కరించే విధానాన్ని అవలంభిస్తానన్నారు. ఎంత పెద్ద వాళ్లైనా తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెడతాన్నారు.


