Business
oi-Lingareddy Gajjala
కుటుంబ సభ్యులను కోల్పోయిన దుఃఖంలో ఉన్నవారికి బ్యాంకు పనుల నిమిత్తం కార్యాలయాల చుట్టూ తిరగడం ఒక పెద్ద మానసిక, శారీరక భారంగా మారుతుంటుంది. ముఖ్యంగా మరణించిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోని డబ్బును క్లెయిమ్ చేసుకోవడం కోసం పదేపదే బ్రాంచ్‌లకు వెళ్లడం, పత్రాల సమర్పణ వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
ఖాతాదారుల వారసుల కోసం ప్రత్యేకంగా ‘ఆన్‌లైన్ డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పోర్టల్’ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే కూర్చుని క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేసుకునే విధానం చాలా సులభంగా ఉంటుంది. ముందుగా అభ్యర్థులు https://digital.iob.bank.in/deathClaimonline వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Death Claim ప్రాసెస్ ఇలా..
వెబ్‌సైట్‌లో ‘కొత్త క్లెయిమ్’ (New Claim) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మరణించిన ఖాతాదారుడి వివరాలు, క్లెయిమ్ చేస్తున్న వ్యక్తి వివరాలు, మొబైల్ నంబరు మరియు ఆధార్ నంబరు వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత సదరు ఖాతాకు ‘నామినేషన్’ ఉందా లేదా అనేది ఎంచుకుని, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి నిబంధనలకు అంగీకారం తెలపాలి.
పూచీకత్తు అవసరం లేదు
క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు సామాన్యులకు భారం తగ్గించేలా ఐఓబీ కొన్ని కీలక మార్పులు చేసింది. రూ. 15 లక్షల వరకు చేసే క్లెయిమ్‌ల కోసం బ్యాంక్ అత్యంత సరళీకృత విధానాన్ని అమలు చేస్తోంది.
ఈ మొత్తానికి ఎటువంటి థర్డ్ పార్టీ (మూడవ వ్యక్తి) పూచీకత్తు అవసరం లేదని బ్యాంక్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, దరఖాస్తు చేసుకున్న 15 రోజుల వ్యవధిలోనే సెటిల్‌మెంట్‌ను పూర్తి చేస్తామని ఐఓబీ హామీ ఇచ్చింది. ఇది కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే విషయమని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.


