Business
oi-Lingareddy Gajjala
సాధారణంగా అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం నెలకొంటే సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ, ప్రస్తుతం మార్కెట్ అందుకు పూర్తి భిన్నంగా స్పందిస్తోంది. చెన్నై పసిడి మార్కెట్లో గత 15 రోజుల్లో బంగారం ధరలు ఊహించని విధంగా దాదాపు రూ.13,000 వరకు పడిపోయి కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
మార్చి 19, 2026 నాటి తాజా సమాచారం ప్రకారం, ఈ ధరల పతనం ఇక్కడితో ఆగేలా లేదు. రాబోయే రోజుల్లో మరో రూ.10,000 నుంచి రూ.14,000 వరకు తగ్గి, ఒక సవరి(8 గ్రాములు) బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల మార్కుకు చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో పసిడి ధరలు రికార్డు స్థాయిలను తాకాయి. మార్చి 3వ తేదీన 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,775గా ఉండగా, సవరి ధర రూ.1,26,700 వద్ద ఆల్టైమ్ హైని నమోదు చేసింది. అయితే, గడిచిన రెండు వారాల్లోనే సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం గ్రాము ధర రూ.14,300కు, సవరన్ ధర రూ.1,14,400కు చేరుకుంది. అంటే కేవలం 15 రోజుల్లోనే సవరన్పై రూ.13,160 మేర ధర తగ్గింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటినప్పటికీ బంగారం ధరలు పెరగకపోవడం గమనార్హం.
డాలర్ దూకుడు.. పసిడికి బ్రేకులు..
ఈ విచిత్ర ధోరణికి ప్రధాన కారణం అమెరికన్ డాలర్ బలోపేతం కావడమేనని నిపుణులు వివరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం లావాదేవీలు డాలర్లలో జరుగుతాయి. డాలర్ విలువ పెరగడంతో ఇతర దేశాల పెట్టుబడిదారులకు బంగారం కొనుగోలు భారంగా మారి డిమాండ్ తగ్గింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఆశించిన మదుపరులకు నిరాశే ఎదురైంది. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో వడ్డీ లేని బంగారంపై పెట్టుబడి పెట్టడం కంటే, అధిక లాభాలనిచ్చే ముడి చమురు లేదా స్టాక్ మార్కెట్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.
మారిన మదుపరుల ధోరణి..
గతంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో కనిపించిన ‘భయాందోళనతో కూడిన కొనుగోళ్లు’ (Panic Buying) ఇప్పుడు ఇరాన్ యుద్ధం విషయంలో కనిపించడం లేదు. బంగారం ‘సురక్షిత ఆశ్రయం’ (Safe Haven) అనే హోదా కొంత మందగించింది. రాగి, ప్లాటినం వంటి పారిశ్రామిక లోహాల ధరలు కూడా తగ్గడం ప్రపంచవ్యాప్త పారిశ్రామిక మందగమనానికి సంకేతంగా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడితే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, డాలర్ ఆధిపత్యం ముందు బంగారం మార్కెట్ తలవంచక తప్పడం లేదు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే వరకు పసిడి మళ్లీ మెరిసే అవకాశం తక్కువని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


