Business
oi-Lingareddy Gajjala
ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు, సామాన్య గృహిణుల నుండి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరినీ ఆకర్షించే ఏకైక నినాదం ” బంగారు రుణాల మాఫీ”. తాకట్టు పెట్టిన నగలు తిరిగి ఇంటికి వస్తాయన్న ఆశతో వేలాది మంది సహకార బ్యాంకుల గుమ్మం తొక్కడం దశాబ్దాలుగా కనిపిస్తున్న దృశ్యం.
అయితే, మారుతున్న ఆర్థిక సమీకరణాలు, సాంకేతిక ఆంక్షల నేపథ్యంలో.. ఇకపై సహకార బ్యాంకుల్లో బంగారు రుణమాఫీ అనేది కేవలం ఒక రాజకీయ నినాదంగానే మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇది వినడానికి చేదు నిజమే అయినా, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం ఇకపై రుణమాఫీ అమలు దాదాపు అసాధ్యమని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Gold Loan: రుణమాఫీపైగత అనుభవాల గుణపాఠం
తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ఈ హామీని తమ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటూ వచ్చాయి. 2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఐదు సవర్లలోపు రుణాలను మాఫీ చేయగా, సుమారు 14.50 లక్షల మందికి రూ.6,000 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అయితే, ఈ ప్రక్రియలో విధించిన కఠిన నిబంధనల వల్ల దాదాపు 35 లక్షల మంది అనర్హులుగా మిగిలిపోయారు.
ప్రభుత్వం మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకులకు ఒకేసారి చెల్లించకుండా వాయిదాల పద్ధతిలో ఇవ్వడం, అందులోనూ రూ.400 కోట్లకు పైగా వడ్డీ బకాయిలు ఉండటంతో సహకార బ్యాంకుల ఆర్థిక చక్రం తీవ్రంగా దెబ్బతింది. ఇది బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి వడ్డీ చెల్లించలేని స్థాయికి పరిస్థితిని తీసుకువచ్చింది.
అడ్డంకిగా మారిన సాంకేతికత:
గతంలో ఒకే కుటుంబంలోని సభ్యులు వేర్వేరు సహకార సంఘాల నుండి రుణాలు పొంది, మాఫీ ద్వారా లబ్ధి పొందిన అక్రమాలు వెలుగుచూశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సహకార రంగం మొత్తం కంప్యూటరీకరించబడటంతో పాటు, ప్రతి రుణగ్రహీత ఆధార్ మరియు రేషన్ కార్డులను అనుసంధానం చేశారు.
దీనివల్ల డూప్లికేట్ లబ్ధిదారులను గుర్తించడం ప్రభుత్వానికి సులభతరమైంది. పారదర్శకత పెరగడం ఒక రకంగా మంచిదే అయినా, భారీ స్థాయిలో మాఫీని అమలు చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి పెను సవాలుగా మారింది. గత తనిఖీల్లోనే లక్షలాది మంది అనర్హులుగా తేలడం, ఆ ప్రక్రియలో జరిగిన సమయం, ధన వృధా ప్రభుత్వానికి గట్టి పాఠంగా మారింది.
భారీ ఆర్థిక భారం:
ప్రస్తుత లెక్కల ప్రకారం, ఐదు సవర్లలోపు పెండింగ్‌లో ఉన్న బంగారు రుణాల విలువ సుమారు రూ.20,000 నుండి రూ.25,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఒకవైపు పెరుగుతున్న బంగారం ధరల వల్ల రుణ పరిమాణం కూడా పెరిగింది. నేడు 5 సవర్లపై సుమారు రూ.2.5 లక్షల వరకు రుణం లభిస్తోంది.
ఇప్పటికే భారీ ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్ర బడ్జెట్‌కు ఇంత పెద్ద మొత్తాన్ని మాఫీ చేసి, బ్యాంకులకు తక్షణమే పరిహారం చెల్లించడం తలకు మించిన భారం. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే, సహకార బ్యాంకులు మరుసటి రోజే దివాలా తీసే ప్రమాదం పొంచి ఉంది.
నినాదం వర్సెస్ వాస్తవం:
అంతిమంగా చూస్తే బంగారు రుణమాఫీ అనేది ప్రజలకు ఒకసారి ఉపశమనం కలిగించే తాత్కాలిక మందు లాంటిది. కానీ, ప్రతిసారీ అదే ఆశతో వ్యవస్థను నడపడం అసంభవం. “అప్పు తీసుకుంటే కట్టక్కర్లేదు” అనే సామాజిక దృక్పథం బ్యాంకింగ్ వ్యవస్థ పునాదులనే కదిలిస్తుంది.
భవిష్యత్తులో ప్రజలు తక్కువ వడ్డీ రేట్లు, పారదర్శకమైన రుణ సౌకర్యాలను ఆశించాలే తప్ప, సంపూర్ణ మాఫీని ఆశించడం అత్యాశే అవుతుంది. రాజకీయ నినాదాలు ఓట్ల కోసం ఆశలు కల్పించినా, కఠినమైన ఆర్థిక వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి.


