Business
oi-Lingareddy Gajjala
కొత్త లేబర్ కోడ్ లతో గ్రాట్యుటీ లెక్కించే విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా వేతన నిర్వచనంలో మార్పులు రావడం వల్ల ఉద్యోగులకు లభించే గ్రాట్యుటీ మొత్తాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులపై పూర్తి స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంది.
ఇప్పటి వరకు శాశ్వత ఉద్యోగులకు ఐదేళ్ల నిరంతర సేవ పూర్తి చేసిన తర్వాతే గ్రాట్యుటీ అర్హత ఉండేది. ఫిక్స్డ్ టర్మ్ (Fixed Term) ఉద్యోగులకు సాధారణంగా ఈ ప్రయోజనం పరిమితంగానే ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు ఒక సంవత్సరం పూర్తి చేసిన వెంటనే, వారు పని చేసిన కాలానికి అనుగుణంగా (ప్రో-రాటా ప్రాతిపదికన) గ్రాట్యుటీ పొందే అర్హత పొందుతారు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గణనీయమైన ఊరటగా భావిస్తున్నారు. శాశ్వత ఉద్యోగులకు ఐదేళ్ల సేవ నిబంధన మాత్రం యథాతథంగా కొనసాగనుంది.
అలవెన్సులు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే..
గ్రాట్యుటీ లెక్కింపులో అసలు కీలక మార్పు వేతన నిర్వచనంలోనే ఉంది. ప్రస్తుతం గ్రాట్యుటీని ప్రాథమిక వేతనం (బేసిక్), డియర్నెస్ అలవెన్స్ (DA) ఆధారంగా లెక్కిస్తున్నారు. కానీ కొత్త కోడ్ ప్రకారం ఉద్యోగి మొత్తం జీతంలో కనీసం 50 శాతం భాగాన్ని ‘వేతనం‘గా పరిగణించాల్సి ఉంటుంది. అలవెన్సులు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే, ఆ అదనపు భాగాన్ని కూడా వేతనంలో కలపాలి. దీంతో గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (PF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి ప్రయోజనాల లెక్కింపు బేస్ పెరగనుంది.
ఉదాహరణకు..
ఒక ఉద్యోగి నెల జీతం రూ.70,000 కాగా అందులో బేసిక్ రూ.30,000, అలవెన్సులు రూ.40,000 ఉంటే, పాత విధానంలో గ్రాట్యుటీ లెక్కింపు రూ.30,000 ఆధారంగా జరుగుతుంది. 10 ఏళ్ల సేవకు సుమారు రూ.1.73 లక్షలు లభించవచ్చు. కానీ కొత్త విధానం ప్రకారం అలవెన్సుల్లో 50 శాతం మించిన అదనపు మొత్తాన్ని కూడా వేతనంలో చేర్చడం వల్ల గ్రాట్యుటీ లెక్కింపు బేస్ రూ.35,000కు పెరిగి, అదే 10 ఏళ్లకు సుమారు రూ.2 లక్షలకు పైగా లభించే అవకాశం ఉంటుంది.
వివిధ సీటీసీ స్థాయిల్లో కూడా ఈ ప్రభావం కనిపించనుంది. వార్షిక సీటీసీ రూ.6 లక్షలు ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం లభించే గ్రాట్యుటీ సుమారు రూ.14,000 ఉంటే, అది కొత్త విధానంలో రూ.19,000 వరకు పెరగవచ్చు. అలాగే రూ.12 లక్షల సీటీసీకి సుమారు రూ.28,000 నుంచి రూ.38,000 వరకు, రూ.24 లక్షల సీటీసీకి సుమారు రూ.57,000 నుంచి రూ.75,000 వరకు పెరుగుదల కనిపించే అవకాశముంది.
శాలరీ విభజనలో మార్పు..
ఈ మార్పులతో కంపెనీలు తమ శాలరీలను రీడిజైన్ చేసే అవకాశముంది. బేసిక్ వేతనం పెరిగితే.. PF, NPS, గ్రాట్యుటీ వంటి చెల్లింపుల భారం కూడా పెరుగుతుంది. అందువల్ల సంస్థలు శాలరీ డివిజన్ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక మరో ముఖ్యమైన అంశం, ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సేవ చేసిన కాలానికి మాత్రమే పెరిగిన గ్రాట్యుటీ వర్తిస్తుందా, లేక మొత్తం సేవా కాలానికి వర్తిస్తుందా అన్నది ఇంకా పూర్తిగా స్పష్టత పొందలేదు. దీనిపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
అమల్లోకి వస్తే..
మొత్తంగా చూసినప్పుడు, కొత్త కార్మిక కోడ్లు అమల్లోకి వస్తే ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగించే అవకాశముంది. అయితే అసలు లాభం ఎంతవరకు ఉంటుందో ఉద్యోగి జీత నిర్మాణం, సంస్థ తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం ఇచ్చే స్పష్టత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు తమ వేతన నిర్మాణాన్ని సమీక్షించుకోవడం, గ్రాట్యుటీ లెక్కింపును అర్థం చేసుకోవడం సమయోచితమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


