International
oi-Chandrasekhar Rao
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల వన్ టైమ్ H-1B వీసా ఫీజు వ్యవహారం భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అధిక ఛార్జీని చెల్లించడానికి ఇష్టపడక అనేక మధ్యస్థాయి కంపెనీలు, కన్సల్టెన్సీలు తమ ఉద్యోగ ఆఫర్‌లను రద్దు చేసుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలు స్టార్ట్ డేట్‌లను వాయిదా వేస్తున్నాయి. మరికొన్ని విదేశీ నియామకాలను పూర్తిగా నిలిపివేస్తున్నాయి.
నిజానికి ఈ విధానం వల్ల దెబ్బతింటున్నది టెక్ ప్రపంచం ఒక్కటే కాదు. ఆ విధానానికి కేంద్రబిందువుగా భావిస్తోన్న “అమెరికా ఫస్ట్” ప్రణాళిక కూడా. ఈ ఫీజు పెంపు అసలుకే మోసం ఏర్పడింది. ఆర్థికంగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని యూఎస్‌సీఐఎస్ (USCIS) డేటా స్పష్టం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు 85 మంది మాత్రమే 1,00,000 డాలర్ల ఫీజును చెల్లించారంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాకు దీని ద్వారా 8.5 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. బ్లూమ్‌బెర్గ్ గతంలో అంచనా వేసిన 70 మంది చెల్లింపుదారుల సంఖ్యతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదల మాత్రమే. అసలు నష్టం ఇతర రంగాల్లో చోటు చేసుకుంది. విదేశీ రాయబార కార్యాలయాల నోటిఫికేషన్‌లు అవసరమయ్యే సాధారణ H1B పిటిషన్ల ఫీజులు భారీగా తగ్గాయి. 2024 సెప్టెంబర్ 21 – 2025 ఫిబ్రవరి 15 పోలిస్తే, యూఎస్‌సీఐఎస్ ఆ రెగ్యులర్ ఫీజుల ద్వారా సుమారు 28 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఇప్పుడు అదే కాలానికి ఈ సంఖ్య 8.5 మిలియన్ డాలర్లకు పడిపోయింది. హెచ్ 1బీ ఫీజు పెంపు తర్వాత 20 మిలియన్ల డాలర్ల మేర కొరత ఏర్పడింది. ఈ గణాంకాలను ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ ఫెలో కానర్ ఓబ్రెయిన్ వెల్లడించారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ సీనియర్ ఫెలో, ఇమ్మిగ్రేషన్ పాలసీ నిపుణుడు ఆరోన్ రీచ్లిన్-మెల్నిక్ దీన్ని నిర్ధారించారు కూడా. ఆదాయం భారీగా తగ్గిందనే విషయాన్ని ఆయన అంగీకరించారు.
బ్లూమ్‌బెర్గ్ అంచనా ప్రకారం టెక్ సంస్థల యజమానులు ఇప్పుడు అమెరికాలో ఇప్పటికే ఉన్న విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారికి 1,00,000 ఫీజు వర్తించదు. ఈ ఫీజును ప్రవేశపెట్టిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈ ఏడాది అక్టోబర్‌లో ముగియనుంది. దానిని పునరుద్ధరిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. H1-B వీసాల విషయంలో అమెరికా రాష్ట్రాలు స్వతంత్రంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ యూనివర్శిటీల్లో హెచ్ 1బీ నియామకాలను నిలిపివేసింది ఫ్లోరిడా.
అలాగే టెక్సాస్ కూడా. 2027 మే 31 వరకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, స్టేట్ ఏజెన్సీలలో H-1B నియామకాలకు స్వస్తి పలికింది. హెచ్1 బీ ఫీజు వ్యవహారం ఇప్పటికే కార్మికుల నియామకాలు, ప్రయాణాలకు తీవ్ర అంతరాయం సృష్టిస్తోందని కానర్ ఓబ్రెయిన్ తెలిపారు. టెక్ సంస్థలు విదేశీ టాలెంట్ ను నియమించుకోలేకపోతున్నాయని, ఇందులో విధానపరమైన లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.


