PhonePe సంచలనం: సిగ్నల్ లేకున్నా పేమెంట్స్

Date:


Business

oi-Lingareddy Gajjala

భాగ్యనగర మెట్రో ప్రయాణికుల కోసం ఫోన్‌పే ఒక అద్భుతమైన వరాన్ని అందించింది. ప్రయాణాల్లో ఇంటర్నెట్ అంతరాయం కలగడం లేదా ఆన్‌లైన్ పేమెంట్స్ ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలకు చెక్ పెడుతూ, పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేసే ‘రూపే ఆన్-ది-గో’ కార్డును అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో భాగంగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్దే ఈ కార్డులు లభిస్తాయి.

ఈ కార్డు ‘స్టోర్డ్ వాల్యూ’ (Stored Value) అనే అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. అంటే, మీ కార్డులోని చిప్‌లోనే డబ్బులు నిల్వ ఉంటాయి. దీనివల్ల మెట్రో స్టేషన్ల వంటి అండర్‌గ్రౌండ్ ఏరియాల్లో ఇంటర్నెట్ సరిగ్గా లేకపోయినా, కేవలం కార్డును ట్యాప్ చేయడం ద్వారా సెకన్ల వ్యవధిలో టికెట్ ఛార్జీని చెల్లించవచ్చు.

ఈ కార్డ్ ఎలా పొందాలి?

మెట్రో స్టేషన్లలోని కౌంటర్ల వద్ద మీ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ధ్రువీకరించడం ద్వారా ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. క్యాష్, యూపీఐ.. ఇతర కార్డుల ద్వారా ఈ కార్డులో డబ్బులు జమ చేసుకోవచ్చు. ఇందులో గరిష్ఠంగా రూ. 2,000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. ఒక్కో ఆఫ్‌లైన్ లావాదేవీని గరిష్ఠంగా రూ. 500 వరకు నిర్వహించుకునే వీలుంది.

ఒక్క కార్డు.. దేశమంతా ప్రయాణం!

ఈ కార్డు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) నిబంధనల ప్రకారం రూపొందించినందున, దీనిని దేశవ్యాప్తంగా ఎన్‌సీఎంసీ సదుపాయం ఉన్న అన్ని మెట్రోలు (ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు), బస్సులు, రైళ్లు, టోల్ ప్లాజాలు మరియు పార్కింగ్ కేంద్రాల్లో ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తులో దేశంలోని అన్ని రవాణా సంస్థలతో అనుసంధానం చేయడమే తమ లక్ష్యమని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇక క్యూ లైన్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఈ ‘రూపే’ కార్డుతో స్మార్ట్‌గా, వేగంగా ప్రయాణించవచ్చు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related