India
oi-Syed Ahmed
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రోడ్లపై పెరుగుతున్న వాహనాల వేగం, నిర్లక్ష్యం, ఇతరత్రా కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అత్యవసర చికిత్స ఉచితంగా అందించాల్సిందేనని సుప్రీంకోర్టు తాజాగా ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ పీఎం-రాహత్ (PM-RAHAT) పేరుతో ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు.
ఇవాళ ఢిల్లీలోని ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం సేవా తీర్ధ్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ ఈ పీఎం-రాహత్ పథకాన్ని కూడా ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే ఆస్పత్రులకు తరలించిన తర్వాత అక్కడ నగదు రహిత చికిత్స అందేలా ఈ పథకాన్ని కేంద్రం అమల్లోకి తెస్తోంది. అయితే లక్షన్నర వరకూ మాత్రమే ఈ నగదు రహిత చికిత్స అందుతుంది. అంతకంటే పెద్ద ప్రమాదం జరిగి ఎక్కువ మొత్తం ఖర్చయితే బాధితులే భరించాల్సి ఉంటుంది.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బాధితుల్ని ఆస్పత్రులకు తరలించడంతో పాటు వైద్యసేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు స్పందించకపోతే బాధితుల్ని కాపాడటం వైద్యులకు కూడా కష్టమవుతుంది. అందుకే ప్రమాదానికీ, ఆస్పత్రికి తరలింపుకూ మధ్య ఉన్న సమయాన్ని గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు. ఈ గోల్డెన్ అవర్ లో బాధితుల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుడిని ఆస్పత్రికి తీసుకురాగానే వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలి. తమ వద్ద తగిన సౌకర్యాలు లేకపోతే ఇతర ఆస్పత్రులకు పంపాలి. ఈ రవాణా సౌకర్యం కూడా సదరు ఆస్పత్రే చూసుకోవాలి. బాధితుడు డిశ్చార్జ్ అయిన తర్వాత అయిన బిల్లును ఆస్పత్రులు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి రీయింబర్స్ మెంట్ పొందాలి. ప్రమాదం జరిగిన తర్వాత ఏడు రోజుల వరకూ బాధితులు ఆస్పత్రుల్లో ఈ సేవలు పొందవచ్చు.


