India
oi-Syed Ahmed
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల (Tamil nadu Assembly Election 2026) షెడ్యూల్ వచ్చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార డీఎంకే కూటమితో పాటు విపక్ష అన్నాడీఎంకే కూటమి, విజయ్ కొత్త పార్టీ.. ఇలా ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇందులో విజయ్ ను కలుపుకునేందుకు బీజేపీ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి ఎలా ఉందో జాతీయ మీడియా న్యూస్ ఛానల్ న్యూస్ 18 స్నాప్ పోల్ ఫలితాలు వెల్లడించాయి.
న్యూస్ 18 స్నాప్ పోల్ లో తమిళనాడులో ప్రజాభిప్రాయం (Tamil nadu survey)ఎలా ఉందో వెల్లడైంది. ఇందులో డీఎంకే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ఓటర్లను ప్రశ్నిస్తే చాలా బాగుందని 32.8 శాతం, బాగుందని 7.4 శాతం, యావరేజ్ గా ఉందని 12.3 శాతం, బాగోలేదని కేవలం 18.9 శాతం మంది, అస్సలు బాగోలేదని 20 శాతం చెప్పారు. మరో 8.6 శాతం మంది చెప్పలేమన్నారు. తమిళనాడు తదుపరి సీఎంగా ఎవరిని ఎంచుకుంటారని అడిగితే స్టాలిన్ ను 41.2 శాతం, పళనిస్వామిని 37.5 శాతం, విజయ్ ను 14.9 శాతం మంది సమర్ధించారు.
మీ ప్రస్తుత ఎమ్మెల్యేకు మరోసారి ఓటేస్తారా అని అడిగితే తప్పనిసరిగా అని 35.9 శాతం, వేసే అవకాశం ఉందని 5.6 శాతం, అస్సలు వేయబోమని 28.7 శాతం, వేసే అవకాశం లేదని 18.7 శాతం, చెప్పలేమని 11.1 శాతం చెప్పారు. అలాగే ఈసారి ఎన్నికల్లో ప్రధాన సమస్యలేంటని అడిగితే మహిళల భద్రత 17.8, శాంతిభద్రతలు 17.3, మద్యం, డ్రగ్స్ 16.9 శాతం, నిరుద్యోగం 15.5 శాతం, అవినీతి 7.2 శాతం అని చెప్పారు. అలాగే విజయ్ పై భార్య ఆరోపణల ప్రభావం ఎన్నికలపై ఉంటుందా అని అడిగితే 38.7 శాతం కచ్చితంగా ఉంటుందన్నారు. కొంచెం ఉండొచ్చని 10.4 శాతం, ఉండదని 32 శాతం చెప్పారు. వీటి ఆధారంగా చూస్తే తమిళనాడులో గెలుపు అవకాశాలు డీఎంకే కూటమికి మరోసారి ఉండొచ్చని అర్దమవుతోంది.


